ఆస్కార్ సంబరాలలో బండి సంజయ్ పై నెటిజన్లు విసుర్లు

Saturday, January 18, 2025

నిత్యం మీడియాలో మైలేజ్ కోసం ఆలోచనలేకుండా ఎదుటివారిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ, అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ తరచూ ఆత్మరక్షణలో పడుతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలిచిన సందర్భంగా చేసిన అనుచిత వాఖ్యలు మరిచిపోకముందే గతంలో చేసిన వ్యాఖ్యలు ఆయనను వెంటాడుతున్నాయి.

అంతర్జాతీయ వేదికపై ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగోడి సత్తా చాటి, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకొని మొత్తం దేశమే సంబరాలు జరుపుకుంటున్న సమయంలో అందరి మాదిరిగా సంజయ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఇదే సినిమాపై, ఇదే పాటపై గతంలో సంజయ్ చేసిన అనుచిత వాఖ్యలు, దర్శకుడికి చేసిన హెచ్చరికలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘ఆర్ఆర్ఆర్ విజయాన్ని మోదీ ఖాతాలో వేసుకుంటారేమో? మోదీ వల్లే ఆస్కార్ వచ్చిందని ప్రచారం చేస్తారేమో?’ అంటూ సంజయ్ ను మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా టీజర్ విడుదల సందర్భంగా సంజయ్ చేసిన వాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. సినిమాలో మార్పులు చేయకుండా విడుదల చేస్తే థియేటర్లను తగులబెడతామంటూ గట్టిగా హెచ్చరిక కూడా చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
 ఆనాడు సంజయ్ చేసిన విమర్శలు, హెచ్చరికల వీడియోలను బిఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రాజమౌళికి అప్పుడు వార్నింగులు ఇస్తూ పోస్టులు పెట్టిన వాళ్లంతా ఇప్పుడు అదే సినిమా టీం సాధించిన ఘనతకు సాహో అంటూ శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారంటూ ఇప్పుడు ఆ వీడియోతో ట్రోల్స్ చేస్తున్నారు.

కుమ్రం భీం జయంతి సందర్భంగా సినిమా టీజర్ విడుదల చేశారు. అందులో భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ సినిమాలో తలకు టోపీ పెట్టుకొని కనిపించాడు. అది చూసిన బండి సంజయ్ నిజాం ర‌జాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కుమ్రం భీంకు టోపీ పెట్టడం ఏంట‌ని మండిప‌డ్డారు. రాజ‌మౌళికి నిజంగా ద‌మ్ము, ధైర్యముంటే నిజాం ర‌జాకార్లకు బొట్లు పెట్టి సినిమా తీయాల‌ని సవాల్ విసిరారు. సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగలబెడతాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

పైగా, అప్పట్లో నాటు నాటు పాటపైనే సంజయ్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. సినిమాలో అల్లూరి సీతారామరాజును, కొమురం భీం పాత్రలతో.. డ్యాన్సులు చెపించారంటూ తీవ్రంగా మండిపడ్డారు. దేశం కోసం పోరాడిన వారితో కుప్పిగంతులేపిస్తారా? అంటూ ఒంటి కాలి మీద లేచారు బండి సంజయ్.

 “బిడ్డా రాజమౌళి.. కొమురం భీం చరిత్రను కించపరిచేలా, ఆదివాసీల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా తీశావు. బిడ్డా నువ్వు గనక సినిమా విడుదల చేస్తే.. నిన్ను బడిసెలతో కొట్టి పంపిస్తాం. థియేటర్ల యజమానులను కూడా హెచ్చరిస్తున్నా. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తే… ప్రతీ థియేటర్‌ను కాల్చేస్తాం. ఎవ్వరినీ వదిలిపెట్టం.” అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీచేశారు.

ఇప్పుడు అదే బండి సంజయ్ దేశ సినిమా చరిత్రకే గర్వకారణమని, అందులో ప్రత్యేకంగా తెలుగువారికి ఎంతో గర్వకారమంటూ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆనాడు బీజేపీ నేతలు చేసిన మాటలకు భయపడి ఉంటే నేడు తెలుగు సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ సాధించేదా? భారతదేశం పేరు తెలంగాణ పేరు ప్రపంచ వేదికపై మారుమోగేదా? అంటూ ప్రశ్నిస్తూ నెటిజన్లు బండి సంజయ్ వీడియోను ట్రోల్ చేస్తున్నారు.

నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు వచ్చిన సమంయలోనూ బండి సంజయ్ వీడియోను నెటిజన్లు వైరల్ చేశారు. సంజయ్ రాజమౌళిని, ఆర్ఆర్ఆర్ సినిమాపై నిప్పుల వర్షం కురిపించిన తర్వాతనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ సినిమా కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది. అంతేకాకుండా, ఈ పాటను పాడిన రాజమౌళి సోదరుడు ఎంఎం కీరవాణికి ప్రతిష్టాకరమైన పద్మశ్రీ పురస్కారం అందించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles