మూడు రోజుల నాటకీయ పరిణామాల అనంతరం తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లు కు గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ ఎట్టకేలకు ఆదివారం ఆమోదం తెలిపారు. గతంలో పలు కీలక బిల్లులను పెండింగ్ లో ఉంచిన సమయంలో స్పందించని గవర్నర్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంకు ముందు రోజే తమకు బిల్లు వచ్చిందని, న్యాయ సలహా తీసుకొనేందుకు కొంత వ్యవధి కావాలని మీడియాకు తెలిపిన తర్వాత రెండు రోజులకే ఆమోదం తెలపడం గమనార్హం.
పెండింగ్ బిల్లులపై కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన సమయంలోనే కేసీఆర్ ప్రభుత్వంకు రాజ్యాంగపరమైన ప్రతిష్టంభన కలిగించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని స్పష్టమైంది. గవర్నర్ దిద్దుబాటు చర్యలకు దిగాల్సి వచ్చింది. తిరిగి తాజాగా, గవర్నర్ మరోసారి ఆర్టీసీ బిల్లు విషయంలో ప్రతిష్టంభన సృష్టించే ప్రయత్నం చేసి వెనుకడుగు వేయాల్సి వచ్చినట్లయింది.
గతంలో మాదిరిగా కేసీఆర్ ప్రభుత్వంకు ఇబ్బందులు కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సుముఖంగా లేదని గ్రహించడంతోనే ఆమె మూడు రోజుల పాటు కాలయాపన చేసి చివరికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ గా తన పట్ల తగు `మర్యాద’ చూపడం లేదని వీలు చిక్కిన్నప్పుడల్లా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న డా. తమిళసై కేసీఆర్ ప్రభుత్వం పట్ల మారిన నరేంద్ర మోదీ ప్రభుత్వం విధానంతో సరిదిద్దుకోక తప్పలేదని పరిశీలకులు భావిస్తున్నారు.
రాబోయే ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న ఈ బిల్లును పెండింగ్ లో ఉంచితే మంత్రులు రాజ్ భవన్ కు వచ్చి ఆమోదం కోసం అర్ధిస్తారని ఆమె అంచనా వేసిన్నట్లున్నది. అయితే తమకు ప్రయోజనం కలిగించే విధంగా కేసీఆర్ తీసుకొచ్చిన బిల్లును ఆపివేస్తారా? అంటూ ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ముట్టడికి రావడంతో ఆమె ఒకింత ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే కేసీఆర్ కు రాజకీయంగా మరింత మేలు చేసిన్నట్లు కాగలదని, బిజెపి రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆమె ఒకింత వెనుకడుగు వేశారు. కార్మిక నేతలను చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందించారు. ఈ లోగా బిల్లుపై వివరణలు కోరుతూ ఐదు అంశాలతో రాష్ట్ర ప్రభుత్వంకు లేఖను పంపారు. వెంటనే కేసీఆర్ ప్రభుత్వం వివరణ అడిగినా మరో మూడు అంశాలపై స్పష్టత కావాలని కోరారు.
వాటికి కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా ఉన్నతాధికారులను వచ్చి కలవమని కోరారు. వారొచ్చి ఆదివారం మధ్యాహ్నం ఆమెతో భేటీ జరిపిన తర్వాత చివరకు ఆమోదం తెలిపారు. మొదట్లో బిల్లును పెండింగ్ లో ఉంచుతున్నట్లు సంకేతాలు ఇచ్చిన తర్వాత అకస్మాత్తుగా ఆమోదింపలేక ఆమె ఈ పక్రియ అంతా నడిపినట్లు పలువురు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు తాను వ్యతిరేకం కాదని, వారి సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని గవర్నర్ ఒక విధంగా సంజాయిషీ ధోరణిలో చెప్పుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం నుంచి రెండుసార్లు వివరణ వెళ్లినా ఆమె సంతృప్తి చెందక పోవడంతో రవాణా కార్యదర్శి సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు కలిసి స్పష్టత ఇవ్వడంతో ఆమె `సంతృప్తి’ చెందారు.
ఆర్టీసీ బిల్లు వ్యవహారంలో శనివారం పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని జులై 31న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 3న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్ అనుమతి కోసం ఈనెల 2న బిల్లు డ్రాఫ్ట్‌ను రాజ్‌భవన్‌కు పంపారు.
దీనిపై కొన్ని సందేహాలను వ్యక్తంచేస్తూ గవర్నర్ కార్యాలయం వివరణ కోరడం, ప్రభుత్వం సమాధానం ఇవ్వడం, గవర్నర్ రెండోసారి అదనపు సమాచారం కోరడం, మరోసారి ప్రభుత్వం తన వివరణ పంపడంతో సస్పెన్స్ కొనసాగింది. గవర్నర్ తీరును నిరసిస్తూ.. ఆర్టీసీ కార్మికులు శనివారం చలో రాజ్‌భవన్ కూడా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం పూట రెండు గంటలపాటు బస్సులను నిలిపేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ బిల్లుకు ఆమోదం తెలిపారు.