`ఆపరేషన్ జానా’ తెలంగాణాలో కాంగ్రెస్ ను ఆదుకొంటుందా!

Sunday, January 19, 2025

తెలంగాణా కాంగ్రెస్ లో మరే పార్టీకి లేనంతమంది నాయకులు ఉండడంతో ఎవ్వరికీ వారుగా మూటలుగా ఏర్పడి, ఒకరొస్తే మరొకరు రాని పరిస్థితుల్లో అధికార బిఆర్ఎస్ తో గాని, కాంగ్రెస్ ను వెనుకకు నెట్టేసేందుకు దూకుడుగా మీదకొస్తున్న బిజెపిపై గాని ఉమ్మడిగా పోరాడలేని పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పార్టీ అగ్రనేత `భారత్ జోడో యాత్ర’ సందర్భంగా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు కూడా నాయకులూ అందరూ కలవలేక పోయారు.

ముఖ్యంగా తెలంగాణాలో కాంగ్రెస్ బలంగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఈ ముఠాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవ్వరికీ వారే గొప్ప అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ నిరసన ప్రదర్శనలు జరపాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించి, నల్గొండలో మొదటి కార్యక్రమం జరుపుతామని ప్రకటిస్తే  తమ ఆమోదం లేకుండా యెట్లా ప్రకటిస్తారంటూ సీనియర్ నేతలో రభస సృష్టించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి సీనియర్ నేతలు అసలు రేవంత్ తో కలసి వేదిక పంచుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో సీనియర్ నేత, మాజీ ప్రతిపక్ష నేత కె జానారెడ్డి చొరవ తీసుకొని, శుక్రవారం నల్గొండలో నిరుద్యోగ నిరసన ప్రదర్శన జరిగేటట్లు చేయడమే కాకుండా, భిన్నధ్రువాలైన నేతలంతా ఒకే వేదికపై కలసి కనిపించడం తెలంగాణ లోని కాంగ్రెస్ శ్రేణులకు ఉత్సాహం కలిగించింది.

పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి రాక సందర్భంగా క్లాక్​టవర్​ సెంటర్​లో జరిగిన నిరుద్యోగ నిరసన ర్యాలీ సభకు ఎంపీలు ఉత్తమ్​ కుమా ర్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హాజరయ్యారు. జిల్లా అగ్రనేతలు అందరూ రేవంత్​ సభలో పాల్గొనడం, ఆయనకు అండగా ఉంటామని స్పష్టం చేయడం పార్టీ కేడర్​లో జోష్​ నింపింది.

  ఉమ్మడి జిల్లా కాంగ్రెస్​ నేతలందరని ఏకతాటికి పైకి తీసుకొచ్చే బాధ్యతను  జానారెడ్డి భుజానెత్తుకుని విజయం సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జానారెడ్డి చేసిన కృషిని వివరించడమేగాక, మంత్రి పదవి త్యాగం చేసిన వెంకట్​ రెడ్డిని కొండా లక్ష్మణ్​ బాపూజీతో రేవంత్ రెడ్డి పోల్చారు. 

ఇదే రకమైన పంథాను ఎన్నికల్లోనూ కొనసాగుతుందని జానారెడ్డి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. పార్టీ గెలుపు కోసం, తాను సమైఖ్య యోధుడిగా పాటుపడతానని చెప్పడం విశేషం. తామంతా కలిసికట్టుగానే ఉన్నామని, చిన్న మనస్పర్ధలు ఉన్నా వాటిన్నింటిని పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేస్తామని ఎంపీ వెంకట్ రెడ్డి సైతం రేవంత్​మద్దతు తెలిపారు.

ప్రధాని మోదీని కలినంత మాత్రాన బీజేపీలో చేరినట్టుకాదని, అట్లాగే రేవంత్​ నల్గొండకు రానంత మాత్రాన తాను అడ్డు చెప్పినట్టు కాదని, పరిస్థితులను బట్టి తామే రేవంత్​ను నల్గొండకు ఆహ్వానిద్దామని అనుకున్నామని అంటూ వెంకట్​రెడ్డి జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొనే ప్రయత్నం చేశారు.

ఉత్తమ్​ కుమార్​ రెడ్డి మరో అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మొత్తం 12 సీట్లు గెలిచి సాధిస్తామని భరోసా వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు సైతం పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరూ కలిసికట్టుగానే ఉన్నామని చెప్పారు.

మొత్తం మీద ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సభకు రావడం, అన్ని నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేయడం పార్టీలో కొత్త ఊపు తీసుకొచ్చింది. అయితే, ఈ ఐక్యత ప్రదర్శన పార్టీ జాతీయ నాయకత్వం నుండి వత్తిడులతో జరిగిన తాత్కాలిక ఉపసమానమేనా? ఎన్నికలు జరిగేంతవరకు – మరో ఆరు నెలలవరకు కొనసాగుతుందా? అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles