ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి, అధికారపక్షంకు దూరంగా జరిగిన ఆ పార్టీ ఎమ్యెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వారిద్దరూ టీడీపీలో చేరేందుకు బేరం కుదుర్చుకుని, ఈ విధంగా ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్నారని నిత్యం వైసీపీ నేతలు, మంత్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
అయితే, టీడీపీ వర్గాల నుండి వారికి బహిరంగంగా ఆహ్వానం ఇప్పటివరకు లభించక పోవడం ఆసక్తి కలిగిస్తోంది. వారిద్దరిని టిడిపిలో చేరుకోవడంపై స్థానిక టిడిపి వర్గాల నుండే అసమ్మతి వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తున్నది. దానితో రేపటి ఎన్నికలలో వారిని అభ్యర్థులుగా నిలబెడితే వారి మేరకు మనస్ఫూర్తిగా పనిచేస్తారో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
పైగా, రామనారాయణ రెడ్డి `అవకాశవాది’ అని, ఇదివరలో ఉన్న పట్టు ఇప్పుడు జిల్లా రాజకీయాలపై ఆయనకు లేదని, ఆయనను చేర్చుకోవడం పార్టీకి నష్టమే అనే అభిప్రాయలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇక శ్రీధర్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఎమ్యెల్యేగా గెలుపొంది, సీఎం జగన్ కు చాలా సన్నిహితుడిగా పేరొందారు. గత ఎనిమిదిన్నరేళ్లుగా తన నియోజకవర్గంలో టిడిపి శ్రేణులకు చుక్కలు చూపిస్తున్నారు. ఆయనను తట్టుకొని నిలబడిన టిడిపి స్థానిక నేతలు ఇప్పుడు ఆయనే అభ్యర్థిగా వస్తే ఏమేరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్ధకరంగా మారుతున్నది.
వీరిద్దరూ కేవలం మంత్రి పదవులు దక్కలేదనే అసమ్మతితోనే పార్టీ అధినాయకత్వంపై తిరుగుబాటు జరిపారని గుర్తు చేస్తూ, ఇప్పుడు టీడీపీ అభ్యర్థులుగా గెలిపిస్తే, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే వారిద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడం చంద్రబాబు నాయుడుకు సాధ్యమవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఒక వేళ, తిరిగి జగన్ అధికారంలోకి వస్తే టిడిపి నుండి గెలిచినా తిరిగి అటువైపు వెళ్లే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.
వారిని పార్టీలో చేర్చుకొని విషయంలో పార్టీ నాయకత్వం తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని నెల్లూరు జిల్లాలో టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే, తాను వచ్చే ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా పోటీచేస్తానని అంటూ కోటంరెడ్డి ప్రకటించుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవ్వరికీ వారుగా తమను అభ్యర్థులుగా ప్రకటించడం తగదని అంటూ సున్నితంగా మందలించారు.
వారిద్దరూ కూడా ఎట్లాగూ వైసీపీలో కొనసాగే అవకాశం లేకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్ గురించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పటికే బీజేపీ నేతలతో మాటలు కలిపారని ప్రచారం జరుగుతుంది. మరోవంక, బిఆర్ఎస్ లో చేరే అవకాశాల గురించి కూడా వారు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే, తిరిగి ఎమ్యెల్యేలుగా గెలుపొందాలంటే వైసిపి లేదా టిడిపిల ద్వారా మాత్రమే సాధ్యం కాగలదు. బిఆర్ఎస్ లేదా బిజెపి అభ్యర్థులుగా పోటీచేసే వారిద్దరూ తమ సొంతబలంపై ఏమేరకు ఎన్నికలలో గెలుస్తారన్నది సందేహాస్పదమే. ఎన్నికలకు ఇంకా సంవత్సరంకు పైగా సమయం ఉండడంతో వీరిద్దరి విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సహితం ఇప్పుడే తొందరపడి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.