వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో సిటింగ్ ఎమ్మెల్యేను వదిలించుకోవడం ఖరారు అయిపోయింది. సీనియర్ నాయకుడు, వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆత్మీయులైన మంత్రుల్లో ఒకడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పూర్తిస్థాయిలో పొగపెట్టింది. ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా పదవిలో ఉన్నరు గనుక.. ఏదో అలా వైసీపీ గొడుగు కింద కంటిన్యూ కావాల్సిందే తప్ప.. మానసికంగా ఆ పార్టీతో ఎన్నడో తెగతెంపులు చేసుకున్నారు. ఆయన సరికొత్త రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే కలిసి సాగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. ఆనంతో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశానికి కొత్త బలం చేకూరుతుందనడంలో సందేహం లేదు.
ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోయారు. నిజం చెప్పాలంటే.. వైఎస్ఆర్ కు సన్నిహితులుగా ఉన్న అనేకమంది నాయకులు.. వైఎస్ కొడుకుగా జగన్ ను అభిమానించి ఈ పార్టీలోకి వచ్చారు. వారెవ్వరూ కూడా ఇవాళ పార్టీలో మిగల్లేదు. వైఎస్ఆర్ టీమ్ అనేది మాయమైపోయింది… ఆయన సొంత భార్య, కూతురుతో సహా! ఇప్పుడు కేవలం జగన్ టీమ్ మాత్రమే మిగిలింది. వైఎస్సార్ సన్నిహితులుగా పార్టీలో మిగిలిన చివరి వ్యక్తులో ఆనం రామనారాయణరెడ్డి కూడా ఒకరు.ఇప్పుడు ఆయన పోకకు రంగం సిద్ధమైంది.
ప్రభుత్వంలో అభివృద్ధి పనులు సరిగా జరగడం లేదని, నియోజకవర్గంలో ప్రజల మధ్య తిరగలేకపోతున్నాం అని చెప్పడమే ఆనం చేసిన తప్పుగా మారిపోయింది. నిజాలు మాట్లాడడాన్ని జగన్, ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయినట్లుంది. అందుకే ఆయనను లూప్ లైన్ లో పెట్టారు. పార్టీ మళ్లీ గెలిచే అవకాశం కూడా తక్కువ అంటూ ఆనం మాట్లాడిన మాటలు జగన్ కు ఆగ్రహం తెప్పించాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే.. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని పార్టీ ఇన్చార్జిగా జగన్ నియమించారు. ఇక నియోజకవర్గంలో అధికారులు ఆయన కనుసన్నల్లోనే పనిచేయాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. అలా ఆనం రామనారాయణరెడ్డి చాలా క్లియర్ గా ఎగ్జిట్ గేట్ చూపించిన వైఎస్సార్ కాంగ్రెస్ తాజాగా ఆనం కు గన్ మెన్ల భద్రతను కూడా తగ్గించింది. ఇది పుండుమీద కారం రాసే వ్యవహారం లాంటిది. ఆయన తన పార్టీ మారే నిర్ణయాన్ని ఖరారు చేసుకున్నారు.
అయితే ఆనం జనసేన వైపు వెళ్లరని. గతంలోనూ తనకు అనుబంధం ఉన్న తెలుగుదేశం లోనే చేరుతారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే.. గత ఎన్ని్కల్లో నెల్లూరుజిల్లాలో బోణీ చేయలేకపోయిన తెలుగుదేశానికి అది శుభవార్త. ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరుజిల్లాకు సంబంధించినంత వరకు దాదాపుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పరిమిత సంఖ్యలో కొన్ని వేల ఓట్లను తన వ్యక్తిగత చరిష్మాతో ప్రభావితం చేయగలరు. ఆ రకంగా ఆయన పార్టీ మారితే తెలుగుదేశానికి పెద్ద లాభం అవుతుంది.
ఆనంతో తెలుగుదేశానికి కొత్తబలం గ్యారంటీ!
Wednesday, January 22, 2025