వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న నవరత్నాల పథకాలకు ఇప్పటి వరకు ఆడిట్ నిర్వహించకపోవడం విస్మయం కలిగిస్తుంది. పెద్ద మొత్తంలో నిధులు, లబ్ధిదారులతో ముడిపడి ఉన్న ఈ పథకాలు ఇంతవరకు ఆడిట్ జరపకపోవడం గమనిస్తే ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాలు ఎంత విచ్చలవిడిగా జరుగుతున్నాయో వెల్లడవుతుంది.
ఈ విషయం గమనించిన అక్కౌంటెంట్ జనరల్ కార్యాలయం ఈ విషయంపై దృష్టి సారించింది. నాలుగేళ్లుగా ఎటువంటి ఆడిట్ జరగకపోవడంతో దిగ్బ్రాంతికి గురయిన్నట్లు తెలుస్తున్నది. దానితో నవరత్నాల పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు పంపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతో ప్రభుత్వ వర్గాలలో కలకలం చెలరేగింది.
ఆర్థికశాఖతో పాటు ఆ పథకాలను అమలు చేసే వివిధ శాఖల ఉన్నతాధికారుల కూడా ఈ మేరకు లేఖలు అందినట్లు చెబుతున్నారు. మరోవంక, ఈ నిధుల వినియోగంపై పూర్తిస్థాయిలో అడిట్ చేయడానికి కూడా ఎజి కార్యాలయం సిద్ధమౌతోంది. దీనిలో భాగంగానే త్వరలో రాష్ట్ర సచివాలయానికి కూడా ఎజి కార్యాలయ అధికారులు స్వయంగా వచ్చి, తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని తెలియడంతో ఇష్టారాజ్యంగా చేసిన ఖర్చుల బండారం బైటపడుతుందని ఆందోళన చెందుతున్నారు.
2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిరచిన జగన్మోహన్‌రెడ్డి నవరత్నాల పేరిట పలు `నగదు బదిలీ’ పథకాలను అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటల ప్రకారమే ఈ పధకాల ద్వారా ఇప్పటికే రూ 2 లక్షల కోట్లకు పైగా నగదును నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేశారు. వచ్చే ఎన్నికలలో ఈ నిధులే ఓట్లు తెచ్చిపెట్టి, మరోసారి గెలిపిస్తాయని జగన్ ధీమాతో ఉన్నారు.
దాదాపుగా నాలుగేళ్ల నుండి ఈ పథకాలు ఉన్నా ఒక్క దానికి కూడా ఇప్పటివరకు ఆడిట్ జరగలేదని తెలిసింది. సంబంధిత శాఖల అధికారులు ఆడిట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాల్సిఉన్నా వారు పట్టించుకోక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇతర శాఖల అధికారులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
బడ్జెట్ ప్రతిపాదనలకు ముందే ఆడిట్ ప్రక్రియను పూర్తి చేయాల్సిఉన్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోలేదని, ఉన్నతస్థాయిలోనూ ఈ విషయాన్ని విస్మరించారని స్పష్టం అవుతుంది. ఆడిట్ నిబంధనల ప్రకారం ఇది తీవ్రమైన లోపంగా వారు చెబుతున్నారు. దీంతో ప్రధాన అక్కౌంటెంట్ కార్యాలయమే రంగంలోకి దిగినట్లు కనిపిస్తుంది.
అందుకే ప్రధాన అక్కౌంటెంట్ జనరల్ (పిఏజి) ఆడిట్‌పై అన్ని శాఖలకు సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. జగనన్న విద్యా కానుక, వైఎస్‌ఆర్ గోరుముద్ద, వైఎస్‌ఆర్ గృహవసతి, వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ పథకాలతోపాటు కేంద్ర నిధులతో అమలు చేసే స్వచ్ఛ భారత్ మిషన్, జాతీయ గ్రామీణ లైవ్లీహుడ్ మిషన్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ వంటి పథకాలకు సంబంధించి ఎజి కార్యాలయం వివరాలు కోరినట్లు తెలిసింది.
బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, అందులో చేసిన వ్యయం, మిగిలిపోయిన నిధుల్లో ఎంత మేరకు తిరిగి ఖజానాకు సరెండర్ చేశారు అన్న వివరాలు సిద్ధం చేయాలని పిఏజి తన లేఖలో కోరారు. అలాగే ఎంతమంది లబ్దిదారులకు ఈ పథకాలు అందించారు? అందుకు ఎంత ఖర్చు చేశారన్న వివరాలు కూడా తెలపాలని ఆదేశించారు.
దీనిపై పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహిరచేరదుకు తమ అధికారులు వస్తారని, వారికి అన్ని విధాల సహకరించాలని అన్ని శాఖలకు సూచించారు. దీనికోసం ఆయా శాఖలు లైజనింగ్ అధికారులను కూడా నియమించాలని ప్రధాన అక్కౌంటెంట్ జనరల్ కార్యాలయం కోరింది.