ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన పార్టీల మధ్య స్టిక్కర్ల పోరు

Sunday, December 22, 2024

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు మరో ఏడాది కాలంపైగా సమయం ఉన్నప్పటికీ ఎమ్యెల్సీ ఎన్నికలతో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. ఇప్పుడు ప్రధాన పార్టీల మధ్య స్టిక్కర్ల యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల మధ్య స్టిక్కర్ల పోరు నెలకొన్నా, మధ్యలో నేనూ కూడా ఉన్నాను అంటూ జనసేన ప్రవేశిస్తుంది.

 వాస్తవానికి ఇంటింటికీ స్టిక్కర్లు అనే కార్యక్రమాన్ని మొదట ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డే అంకురార్పణ చేశారు. గడప గడపకు వైయస్సార్‌, మా నమ్మకం నువ్వే జగనన్న, మా భవిష్యత్‌ నువ్వే జగనన్న అనే నినాదాలతో గత కొంతకాలంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలు ఆయా నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటించి స్టిక్కర్లు అంటిస్తున్నారు. వంద రోజులు కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న కొంత మంది నేతలు తమ నియోజకవర్గాల్లో ఇంటంటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ స్టిక్కర్లు అంటిస్తూ వస్తున్నారు.

దీనికి కౌంటర్ గా ప్రతిపక్ష టీడీపీ, జనసేన రంగంలోకి దిగాయి. కొన్ని జిల్లాల్లో జనసేన కూడా కాబోయే సీఎం పవన్‌ కల్యాన్‌ అంటూ స్టిక్కర్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాజాగా తెలుగుదేశం కూడా సైకో పోవాలి .. సైకిల్‌ రావాలి.. మళ్లి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి అనే నినాదాలతో స్టిక్కర్లు తయారుచేసి ఇంటింటికీ అంటించే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీల మధ్య స్టిక్కర్ల రాజకీయం ఊపందుకున్నట్లయింది. పలు చోట్ల  వైసీపీ అంటించిన స్టిక్కర్లకు పక్కనే టీడీపీ స్టిక్కర్‌ను కూడా అంటిస్తుండటంతో రాజకీయం మరింత వేడెక్కుతోంది.

తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకోసం చేపట్టిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు మంత్రులు, శాసనసభ్యులను రోజుకు 8 గంటలు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్‌ సూచించారు. అందులో భాగం గానే ప్రతి ఇంటికీ స్టిక్కర్లు అంటించాలని నిర్ణయం తీసుకున్నారు.

 టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా జోరు పెంచారు. టీడీపీ నేతలంతా రోజుకు 10 గంటలు ప్రజల్లో ఉండాలని ప్రతి ఒక్కరూ చమటోడ్చి కష్టపడాలని సొంత పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా మెగా పీపుల్స్ సర్వేకు మంచి స్పందన వచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షలకు పైగా కుటుంబాలు ఈ సర్వేలో సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనకు వారి స్పందనలను తెలియజేశారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా 8296082960 నంబర్‌కు 15 లక్షల పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయని ఆ పార్టీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

ఈ సర్వేలో ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్ అంటిస్తున్నారు. ప్రజల అనుమతితోనే వారి ఇళ్లకు స్టిక్కర్లు అంటిస్తున్నామని వైసీపీ నేతలు అంటున్నారు. అదే విధంగా సెల్ ఫోన్ పై అంటించే స్టిక్కర్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కోటి 60 లక్షల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజాభిప్రాయం తీసుకునే పనిలో ఉన్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ స్టిక్కర్ల ప్రచారంపై ప్రతిపక్షాలు కూడా రంగంలోకి దిగాయి. మాకు నమ్మకం లేదు జగన్, మా ఖర్మ నువ్వే జగన్, మా కొద్దు జగన్ అంటూ పోటీ స్టిక్కర్లను కూడా పంపిణీ చేస్తున్నాయి. సీఎం జగన్ కు సంబంధించిన స్టిక్కర్ ఎక్కడ ఉన్నా దాని పక్కనే ప్రతిపక్ష పార్టీలకు చెందిన స్టిక్కర్‌ను కనిపిస్తుంది.

గంజాయి వంటి మత్తు పదార్దాల రవాణా, శాంతి భద్రతల సమస్యలు, జీవో నెంబర్1 పై ప్రతిపక్షాలు స్టిక్కర్లు వేస్తున్నాయి. వైసీపీ స్టిక్కర్ల కార్యక్రమానికి రాయలసీమలో జనసేన కౌంటర్‌ అటాక్‌ మొదలుపెట్టింది. మాకు నమ్మకం లేదు జగన్‌, మా నమ్మకం పవన్‌ అనే ట్యాగ్‌ లైన్‌తో జనసేన కూడా వైసీపీ స్టిక్కర్ల పక్కనే తమ పార్టీ స్టిక్కర్లు అతికిస్తున్నారు.

టీడీపీ కూడా పలుచోట్ల స్టిక్కర్ల యుద్ధం మొదలు పెట్టింది. వైసీపీ నేతలు బలవంతంగా ఇళ్లకు స్టిక్కర్లు అంటిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తున్నారు. కాగా, గతంలో టీడీపీ కూడా పసుపు కుంకుమ స్టిక్కర్లు అతికించిందని, ఇప్పుడు వైసీపీ తయారైందని బీజేపీ ఎద్దేవా చేస్తుంది. పాలకులు ప్రజల గుండెల్లో ఉండాలి కానీ ఇళ్ల గోడలపై కాదని విమర్శలు చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles