ఆంధ్ర నాయకుల గుపెట్లో రేవంత్, కిషన్!

Saturday, September 7, 2024

కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి ఎన్ కుమార్ రెడ్డి పాల్గొనడంతో చెలరేగిన దుమారం సమసిపోవడం లేదు. ఆ వేదికపై నుండి మధ్యలో వెళ్ళిపోయిన మాజీ ఎంపీ విజయశాంతి తెలంగాణ ఉద్యమాన్ని అణచేందుకు చివరికంటా ప్రయత్నించినా వారి సరసన ఉండలేక వెళ్లిపోయానని మొహమాటం లేకుండా చెప్పడంతో కలకలం రేగింది. 

విజయశాంతి వ్యాఖ్యలపై ఇప్పటి వరకు బీజేపీ నేతలు ఎవ్వరూ స్పందించకపోవడం గమనార్హం.  ఈ విషయమై మౌనం వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో అధిక సంఖ్యలో ఉన్న సీమాంధ్ర ప్రజలను ఆకట్టుకోవడం కోసం కిషన్ రెడ్డి వ్యూహాత్మకంగా కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించి భంగపడిన్నట్లు స్పష్టం అవుతుంది.

ఇప్పుడు బిఆర్ఎస్ నేతలు సహితం వచ్చే ఎన్నికలకు చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలను ఓ ట్రంప్ కార్డుగా ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో టిడిపితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ ను ఎన్నుకొంటే తిరిగి ఆంధ్రుల దోపిడీ ప్రారంభం అవుతుంది అంటూ కేసీఆర్ హెచ్చరించి రాజకీయ లబ్ధి పొందారు. టిడిపితో పొత్తు కారణంగానే తాము ఘోరంగా ఓటమి చెందామని కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ చెబుతున్నారు.

ఇప్పుడు అదే విధంగా బిజెపి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు చెప్పుచేతలలో నడిచేవారంటూ బిఆర్ఎస్ ప్రచారం ప్రారంభించింది. ఆర్థిక మంత్రి టి హరీష్ రావు ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గజ్వేల్‌ మండలం శ్రీగిరిపల్లిలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మంత్రి హరీశ్‌ రావు ప్రారంభిస్తూ చంద్రబాబు, కిరణ్‌ కుమార్‌ రెడ్డిలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల నాయకులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ బీజే పీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి చెప్పినట్లు వింటున్నారని, మరోవైపు చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వింటున్నారని ఆరోపించారు. కిషన్‌ రెడ్డి గురువు కిరణ్‌ కుమార్‌ రెడ్డి అని, చంద్రబాబు శిష్యుడు రేవంత్‌ రెడ్డి అని.. వీరిద్దరితో తెలంగాణ బతుకులు ఆగమైతాయని ఆయన హెచ్చరించారు.

వాస్తవానికి పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహితం పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డిపై ఇటువంటి ఆరోపణలే చేశారు. చంద్రబాబు నాయుడు ఏజెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు ఇప్పుడు చేసిన ఆరోపణలని రాబోయే రోజులలో బిఆర్ఎస్ నేతలు మరింత ఉధృతంగా చేసే అవకాశాలు లేకపోలేదు.

మరోవంక, బీజేపీలో కిషన్ రెడ్డి ప్రత్యర్ధులు, ముఖ్యంగా బండి సంజయ్ మద్దతుదారులు సహితం ఆయనపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేస్తే, రాజీనామా చేయకుండా కేవలం కిషన్ రెడ్డి మాత్రమే తప్పించుకున్నారు. ఆ సమయంలో బిజెపికి చెందిన మరో ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ రాజీనామా చేసి, తిరిగి ఉప ఎన్నికల్లో గెలుపొందారు.

బండి సంజయ్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఏపీకి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం తమకు అవసరం లేదని, ఆయనతో పొత్తు కేవలం ఏపీ వరకే అని, తెలంగాణాలో లేదని సంజయ్ స్పష్టం చేస్తూ వచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles