ఆందోళనబాటలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు… ప్రభుత్వంకు నోటీసు!

Wednesday, January 22, 2025

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనబాట పడుతున్నారు.  ఈ మేరకు ఏపీ ఉద్యోగ సంఘం నేతలు సచివాలయంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డిని కలిసి మార్చి 9వ తేదీ నుంచి చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన నోటీసును మంగళవారం అందజేశారు.

ఈ సారి చాయ్‌, బిస్కెట్‌ సమావేశాలతో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేటాయించిన బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కావాలనే పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు.

ఉద్యమ కార్యాచరణలో భాగంగా తొలుత సెల్‌ డౌన్‌, పెన్‌ డౌన్‌, భోజన విరామ వేళ నిరసనలు, తర్వాత కలెక్టరేట్లలో స్పందన దరఖాస్తులు ఇస్తామని వివరించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని వెంకటేశ్వర్లు తెలిపారు.

వయంగా సిఎం ఇచ్చిన హామీలు అమలు కానప్పుడు ఇంకా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీత భత్యాలకు కేటాయించిన బడ్జెట్‌, ఏమవుతుందో తెలియడం లేదన్నారు. ‘మేము పనిచేసిన కాలానికి ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఎందుకు ఇవ్వరు? మేము దాచుకున్న డబ్బులు తిరిగి మా అవసరాలకు ఎందుకు ఇవ్వరు?’ అని ప్రశ్నించారు.

తమకు రావాల్సిన ఎరియర్స్‌, డిఎ బకాయిలు, కొత్త డిఎ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్లు వంటి ఆర్థిక పరమైన అంశాలన్నిటిపైనా స్పష్టమైన లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిఎస్‌ను కలిసిన వారిలో ఎపిజెఎసి అమరావతి నాయకులు వలిశెట్టి దామోదరరావు, పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 9, 10 తేదీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల నిరసన, 13, 14 తేదీల్లో భోజన విరామ సమయంలో ఉద్యోగుల నిరసనలు, 15, 17, 20 తేదీల్లో జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్‌ల దగ్గర ధర్నాలు, 21 నుంచి వర్క్‌టూ రూల్.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని చేయనున్నారు.

మార్చ్ 21న సెల్‌డౌన్‌, యాప్‌డౌన్, 24 నుంచి అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో ధర్నాలు, 27న కరోనాతో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఓదార్పు కార్యక్రమం ఉంటుందని జేఏసీ నేతలు తెలిపారు. సరెండర్ లీవ్‌లు, ఎర్న లీవ్‌లు, జీపీఎఫ్‌ల విషయంలో ఏప్రిల్‌ 1న పోలీసు కుటుంబాల ఇళ్ళకు తిరుగుతామని బొప్పరాజు తెలిపారు. కలెక్టరేట్‌లకు వెళ్ళి గ్రీవెన్స్ నిర్వహిస్తామని, ఏప్రిల్‌ 5న ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, రెండోదశ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు పేర్కొన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles