ఈ సంవత్సరం చివరిలోగా జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం వరుసగా మూడోసారి బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కాకుండా, కేటీఆర్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నదని కొంతకాలంగా సంకేతాలు వెలువడుతున్నాయి. సీఎం పదవి కొడుకుకు అప్పచెప్పడం కోసమే తాను జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నట్లు కేసీఆర్ బిఆర్ఎస్ ప్రారంభించారని వాదనలు కూడా వెలువడుతున్నాయి.
బిఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు పార్టీ వ్యవహారాలలో కేటీఆర్ పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. ఒకవంక కేసీఆర్ కుమార్తె కవిత ఇతర రాష్ట్రాల నాయకులను కలుస్తూ కనిపిస్తుంటే, కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు సహితం బిఆర్ఎస్ కు సంబంధించిన వ్యవహారాలపై మాట్లాడుతున్నారు. ఖమ్మంలో జరిగిన బహిరంగసభ నిర్వహణలో కీలక పాత్ర వహించారు.
సీఎం పదవిని కేటీఆర్ కు అప్పచెప్పేందుకు కవిత, హరీష్ రావు అడ్డు తొలగించుకోవడానికి వారిద్దరిని బిఆర్ఎస్ వ్యవహారాలలో బిజీగా ఉండేటట్లు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. మరోవంక, తెలంగాణకు సంబంధించిన వ్యవహారాలు అన్నింటిని ఇక కేటీఆర్ సారధ్యంలో జరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతుంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వం పక్షాన కేటీఆర్ క్రియాశీలకంగా కనిపిస్తున్నారు. చివరకు గవర్నర్ ప్రసంగంకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కూడా ఆయనే ప్రసంగించారు. సాధారణంగా ఎక్కడైనా ముఖ్యమంత్రి ప్రసంగించడం సంప్రదాయంగా వస్తుంది. కానీ తొలిసారి ఓ మంత్రి మాట్లాడారంటే ఆయన అనధికారికంగా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నట్లు సంకేతం ఇవ్వడమే అని పరిశీలకులు భావిస్తున్నారు.
మరోవంక, ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గం పర్యటన సందర్భంగా అక్కడ జమ్మికుంటలోజరిగిన బహిరంగసభలో వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్యెల్సీ కౌశిక్ రెడ్డి పోటీచేయబోతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. సాధారణంగా ఎమ్యెల్యే అభ్యర్థుల గురించి ఓ నిర్ణయం తీసుకోవలసింది ముఖ్యమంత్రి కాగా, తానే ప్రకటించడం ద్వారా తానే `ముఖ్యమంత్రి’ అన్నట్లుగా వ్యవహరించడంగా వెల్లడి అవుతుంది.