అసెంబ్లీలో టిడిపి ఎమ్యెల్యేలపై దాడి!

Wednesday, January 22, 2025

ఎపి అసెంబ్లీ లో వైసిపి , టిడిపి ఎమ్మెల్యేలు ఘర్ష‌ణ‌కు  దిగడంతో రణరంగాన్ని తలపించాయి.. అసెంబ్లీలో అధికార పక్షం సహనం కోల్పోయి ప్రతిపక్షంపై దాడికి దిగింది. టిడిపి ఎమ్మెల్యేలను వైసిపి ఎమ్మెల్యేలు కొట్టారు. ప్రతిపక్ష టిడిపి సభ్యులపై వైసిపి ఎమ్మెల్యేలు దాడికి దిగారు.

సభ ప్రారంభమైన కాసేపటికే అసెంబ్లీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసిపి ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, టిడిపి ఎమ్మెల్యే వీరాంజనేయస్వామిపై చేయి చేసుకున్నారు. ప్రతిపక్ష సభ్యులు కూడా ప్రతిఘటించి దాడిని అడ్డుకున్నారు. సభలో పరస్పర దూషణలు చేసుకున్నారు. ఒక ద‌శ‌లో బుచ్చ‌య్య చౌద‌రి కింద‌ప‌డిపోయారు.

ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకునేందుకు య‌త్నించారు. స‌భ అదుపు త‌ప్ప‌డంతో 11 మంది టిడిపి స‌భ్యుల‌ను స్పీక‌ర్ స‌భ నుంచి స‌స్సెండ్ చేసి అసెంబ్లీని వాయిదా వేశారు. వరుసగా ఏడవరోజున కూడా టిడిపి సభ్యులను సభ నుండి బహిష్కరించి సభాకార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేయడం గమనార్హం.

నేటి ఉద‌యం టిడిపి స‌భ్యులు జివో నెంబ‌ర్ 1 రద్దు కోరుతూ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాయి. అయితే దీనిని స్పీక‌ర్ తిర‌స్క‌రించారు.  ఈ సంద‌ర్భంగా టిడిపి స‌భ్యులు ప్ల‌కార్డుల‌తో స్పీక‌ర్ పోడియం వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టారు. ఈ స‌మ‌యంలోనే సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య టీడీపీ సభ్యులు బాలాంజ‌య‌నేయులు, బుచ్చియ్య చౌద‌రి వ‌ద్ద‌కు దూసుకువ‌చ్చారు.

వారి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. సభ అదుపు త‌ప్ప‌డంతో టిడిపి స‌భ్యుల‌ను సస్పెండ్ చేసిన స్పీక‌ర్ స‌భ‌ను వాయిదా వేశారు. స్పీకర్ సమక్షంలోనే తమ ఎమ్మెల్యేలపై దాడి జరిగిందని, అసెంబ్లీ చరిత్రలో ఇంతకంటే దారుణమైన ఘటనలు ఎప్పుడూ జరగలేదని అంటూ టిడిపి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆదివారం నుంచే ప్లాన్ చేశారని, ఇవాళ దాడి చేశారని ఆరోపించారు.

ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలపై దాడిని ఖండించారు. అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు చీకటి రోజు .. చట్ట సభలకు మచ్చ తెచ్చిన సీఎంగా జగన్ నిలిచిపోతారని ధ్వజమెత్తారు. అది శాసనభ సభ కాదు.. కౌరవ సభ అంటూ మండిపడ్డారు.

అయితే, టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయులు స్పీకర్ పై దాడి చేశారని, తాను అడ్డుకోవడానికి వెళ్తే తనపైనా దాడి చేశారని వైసిపి సభ్యులు ఆరోపించారు. సుధాకర్ బాబు కూడా అడ్డుకోబోతే అసయనపైనా దాడి చేశారని పేర్కొంటూ సభాపతిని టీడీపీ అవమానించిందని విమర్శించారు. బీసీ అయిన సభాపతిని కాపాడుకోవడానికి వెళ్లామని.. టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

జీవో నంబర్‌ 1 ని రద్దు చేయాలని, అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని, తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ టీడీపీ, వామపక్ష పార్టీలు సోమవారం ఛలో విజయవాడకు పిలుపునిచ్చాయి.
దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో వివిధ పోలీస్ స్టేషన్లలో అంగన్‌వాడీలు ఆందోళన చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించి, టీడీపీ, వామపక్షాల వారిని ఎవరినీ అటువైపు వెళ్లకుండా చేసేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు అధికార పక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles