అధికార వికేంద్రీకరణ, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో మూడు రాజధానుల అభివృద్ధి, తద్వారా మూడు ప్రాంతాలలోనూ సమానమైన వికాసం.. ఇలాంటి పడికట్టు పదాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుగేళ్లుగా మాయ చేస్తూనే ఉన్నారు. అమరావతి రాజధాని విషయంలో కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి సర్కారు మూడు రాజధానుల పేరుతో ప్రారంభించిన ఆట వెనుక గల అసలు సీక్రెట్ ను మంత్రి గుడివాడ అమర్నాథ్ బయటపెట్టారు. ఆయన మాటలను జాగ్రత్తగా బిట్వీన్ ది లైన్స్ గమనిస్తే మనకు విషయం అర్థమవుతుంది. అధికార వికేంద్రీకరణ అనే వ్యూహం వెనుక గల అసలు రహస్యం.. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం కానే కాదు, అసలు ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా రోజులు నెట్టుకు రావడం.. అని మనకు బోధపడుతుంది. ఈ సంగతే మంత్రి మాటల్లో మనకు కనిపిస్తోంది.
ఇంతకు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏం చెప్పారంటే..
రాష్ట్రానికి విశాఖపట్నం కొత్త రాజధాని కాబోతోంది. త్వరలోనే ఇక్కడి నుంచే పాలన ప్రారంభం అవుతుంది. అందుకు కావలసిన అన్ని అర్హతలు వసతులు, విశాఖపట్నానికి ఉన్నాయి. ఇప్పటికే నగరం బాగా అభివృద్ధి చెందింది. వసతులు ఉన్నాయి. కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు.. అని మంత్రి గుడివాడ అమరనాథ్ సెలవిచ్చారు.
విశాఖకు రాజధాని రావడం ద్వారా యావత్ ఉత్తరాంధ్ర విపరీతంగా అభివృద్ధి చెందిపోతుందని ధర్మాన ప్రసాదరావు ఇలాంటి నాయకులు బుకాయింపు ప్రకటనలు చేస్తూ ఉండగా.. కొంతమంది ప్రజలు ఆ బుట్టలో పడుతున్నారు. అయితే విశాఖను రాజధానిగా ఎంపిక చేయడానికి అసలు కారణాన్ని గుడివాడ బయట పెట్టారు. విశాఖ అయితే కొత్తగా ఏమీ అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు.. అనే వ్యూహంతోనే జగన్ సర్కారు ఈ ప్రయత్నం చేస్తున్నట్లుంది.
విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెంది ఉంది అన్ని వసతులు ఉన్నాయి.. అని గుడివాడ అమర్నాథ్ అంటున్నప్పుడు.. అక్కడ ప్రస్తుతం ఉన్న అభివృద్ధి అంతా ఎవరు చేసినట్లు? అంతా చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినదే కదా. చంద్రబాబు విశాఖపట్నంకి ఒక రూపు తీసుకు వస్తే.. అక్కడ రాజధాని పెట్టి పబ్బం గడుపుకోవాలని వైఎస్ఆర్ సీపీ చూస్తున్నది. జగన్ పాలన మొదలైన తర్వాత.. విశాఖలో ఋషికొండ విధ్వంసం తప్ప చేపట్టిన మరొక నిర్మాణాత్మక కార్యక్రమం ఏదీ లేదు. అక్కడ అన్ని వసతులు అమరి ఉన్నాయి కాబట్టే రాజధాని అనే డ్రామా ఆ కేంద్రంగా నడిపిస్తున్నారని ఇప్పుడు అర్థం అవుతుంది.
ఎగ్జిక్యూటివ్ రాజధాని అని చెబుతున్న విశాఖకి ఏమీ చేయవలసిన అవసరం లేదని చెబుతున్న ప్రభుత్వం.. తోతూ మంత్రంగా రాజధానులుగా ప్రకటిస్తున్న అమరావతి, కర్నూలుకు ఏం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మూడు రాజధానుల ముసుగులో ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు నెమ్మది నెమ్మదిగా ప్రజలకు అర్థం అవుతున్నాయి.