అసమ్మతి ఎమ్యెల్యేల రాజీనామాలపై వైసీపీకి చిక్కులు!

Tuesday, November 5, 2024

నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారని పార్టీ నుండి సస్పెండ్ చేసిన ముగ్గురు ఎమ్యెల్యేలు నేరుగా టిడిపి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటె ఏమీ చేయలని చిక్కుల్లో అధికార వైసీపీ నేతలు కనిపిస్తున్నారు. వారిని ముందుగా వైసిపి ద్వారా వచ్చిన ఎమ్యెల్సీ పదవులకు రాజీనామా చేయమని గట్టిగా అడగలేని ఇబ్బంది ఏర్పడింది.

టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ `యువగళం’ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించడంతో ఈ ముగ్గురు వైసిపి ఎమ్యెల్యేలు ముందుండి సన్నాహాలు చేస్తుండటం అధికార పార్టీకి మండిపోతుంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లాలో ప్రవేశించగానే తాను పోటీచేయాలి అనుకొంటున్న ఆత్మకూరు నియోజకవర్గంలో అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

మరోవంక, ఉదయగిరి ఎమ్యెల్యే చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రురల్ ఎమ్యెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహితం తమ తమ నియోజకవర్గాలలో పాదయాత్ర బాధ్యతలు చేపట్టారు. కొంతకాలంగా మంత్రి పదవి పోయినప్పటి నుండి పార్టీలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న నెల్లూరు ఎమ్యెల్యే అనిల్ కుమార్  తానింకా సీఎం జగన్ వెంటే ఉన్నట్లు చెప్పుకొనేందుకు ఈ ముగ్గురు ఎమ్యెల్యేలపై దండయాత్ర చేయడంతో ఈ సమస్య తెరపైకి వచ్చింది.

వీరంతా జగన్ దయతో గత ఎన్నికల్లో గెలిచారని చెబుతూ వచ్చే ఎన్నికల్లో  ఓటమి తథ్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా, ఆనం రామనారాయణ రెడ్డిని టార్గెట్ చేస్తూ సిగ్గు, శరం ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు.

అనిల్ సవాల్ పై స్పందించిన ఆనం తాను వెంకటగిరిలో రాజీనామా చేస్తానని, అనిల్ నెల్లూరు సిటీలో రాజీనామా చేసి ఇద్దరం నీకు నచ్చిన చోట నుంచి పోటీ చేద్దాం, నీ నాయకుడు ఒప్పుకుంటాడేమో చెప్పు అంటూ ఎదురు సవాల్ విసిరారు. “మా గురించి మీ నాయకుడే (జగన్” మౌనంగా ఉన్న ఉన్న సమయంలో నువ్వేందుకు మొరుగుతున్నావు” అంటూ ఎద్దేవా చేశారు.

వైసిపి నుండి సస్పెండ్ అయినా సాంకేతికంగా వారు ముగ్గురు ఇంకా వైసిపి ఎమ్యెల్యే. వారు వచ్చే ఎన్నికలలో టీడీపీ నుండి పోటీ చేస్తున్నామని బహిరంగంగా ప్రకటిస్తున్నా ముందు ఎమ్యెల్యే పదవులకు రాజీనామా చేయమని సీఎం జగన్ గాని, ఆయన చుట్టూ ఉన్న మంత్రులు గాని ఇప్పటి వరకు అడగక పోవడం గమనార్హం.

మూడు- నాలుగు ఏళ్ళ క్రితమే కరణం బలరాం, వల్లభనేని వంశి వంటి నలుగురు టీడీపీ ఎమ్యెల్యేలు  బహిరంగంగానే వైసిపిలో కొనసాగుతున్నారు. వారితో ఎమ్యెల్యే పదవులకు రాజీనామా చేయించి, ఉపఎన్నికలకు వెళ్లేందుకు జగన్ సాహసించలేదు. ఇప్పుడు టీడీపీ వైపు వెడుతున్న ముగ్గురు ఎమ్యెల్యేల రాజీనాలు కోరితే, ముందుగా వారితో రాజీనామా చేయించాలనే ప్రశ్న తలెత్తుతుంది. అందుకనే వైసిపి నాయకత్వం మౌనంగా ఉంటూ వస్తోంది.

ఇప్పుడు ఇదే అదను అనుకోని, ముందుగా వైసిపిలో కొనసాగుతున్న టిడిపి ఎమ్యెల్యేలతో రాజీనామా చేయిస్తే తాము కూడా చేస్తామని ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని చెబుతూ తాము ప్రతిపక్షంలో ఉన్నామని, ఇంకా ఏడాది అధికారం ఉన్నా వద్దని బయటకు వచ్చామని గుర్తు చేశారు.

లోకేశ్ చేత నెల్లూరు టికెట్ కన్ఫర్మ్ చేసుకుని తనపై పోటీ చేయాలని, . అప్పుడు ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని అనిల్ కుమార్ ఆనంకు సూచించారు. నెల్లూరు సిటీలో పోటీ చేసే దమ్ము ఆనం రామనారాయణ రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు.

అయితే, తాను గతంలో నెల్లూరు, రాపూరు, ఆత్మకూరు, వెంకటగిరి ల నుంచి పోటీ చేశానని ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు.  చంద్రబాబు ఆదేశిస్తే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నా అందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఒకవేళ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల గెలుపు బాధ్యతను అప్పగిస్తే ఆ పని చేస్తానని రామనారాయణ రెడ్డి వెల్లడించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles