సంవత్సరం దాటినా తనపై వేసిన సస్పెన్షన్ వేటును తొలగించకపోవడంతో బీజేపీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ తో తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చేైర్మన్ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని రాజాసింగ్ నివాసానికి వెళ్లి ఆయనతో ఈటల సమావేశమయ్యారు.
గోషామహల్ నుండి తిరిగి పోటీచేయనని, హుజురాబాద్ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు అంగీకరిస్తే సస్పెన్షన్ తొలగిస్తామని సంకేతాలు ఇచ్చారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. పైగా, గత వారం ఆర్ధిక మంత్రి హరీష్ రావును రాజాసింగ్ కలవడంతో ఆయన బిఆర్ఎస్ లో చేరేందుకు చూస్తున్నారనే వార్తలు వచ్చాయి.
అయితే, తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తూ సీట్ ఇచ్ఛిన్నా, ఇవ్వక పోయినా, సస్పెన్షన్ రద్దు చేసినా, చేయకపోయినా తాను మరో పార్టీలో చేరే ప్రసక్తే లేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ కమిటీ చేైర్మన్ గా నియమించినప్పటి నుండి ఈటెల వరుసగా పార్టీలో అసంతృప్తిగా ఉంటున్న నేతలను కలుస్తున్నారు.
రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్ తొలగించాల్సిందిగా గతంలో ఢిల్లీ అధిష్టానానికి పార్టీ రాష్త్ర అధ్యక్షునిగా బండి సంజయ్ పలుమార్లు లేఖలు రాశారు. అయినా ఇప్పటివరకు రాజాసింగ్‌పై సస్పెన్షన్ తొలగించడంపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ లోగా కిషన్ రెడ్డి ఈ నెల 21న రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు.రాజాసింగ్ – కిషన్ రెడ్డిల మధ్య గతం నుండే విబేధాలు కొనసాగుతూ వస్తున్నాయి. అందుకనే ఈటెల ప్రత్యేకంగా కలిసినట్లు తెలుస్తోంది.
గోషామహల్ నియోజకవర్గంలో బిజెపి కార్యకర్తలు, కార్పోరేటర్‌పై అధికార బిఆర్ఎస్ తప్పుడు కేసులు బనాయించిందని, ఈ విషయాన్ని తాము కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ల దృష్టికి తీసుకు వెళ్లామని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. పోలీసులు దౌర్జన్యం చేస్తుండటంతో బిజెపి కార్యకర్తలకు అండగా నిలబడేందుకు ఈటల ఈ రోజు తన వద్దకు వచ్చారని తెలిపారు.
ఈటల కార్యకర్తలు, కార్పోరేటర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. కార్యకర్తలకు ఆర్థికంగా, రాజకీయంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని ఈటల హామీ ఇచ్చారని తెలిపారు. చాలారోజులుగా తామిద్దరం కలవాలనుకుంటున్నామని, కానీ ఇప్పుడు ఈటల స్వయంగా వచ్చారని రాజాసింగ్ వివరించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ బిజెపి కార్యకర్తలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. బిజెపి నాయకులపై నమోదైన కేసులపై పోలీస్ అధికారులతో మాట్లాడుతానని చెప్పారు. రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం అధిష్టానం పరిధిలో ఉందని చెబుతూ రాజాసింగ్ సస్పెన్షన్‌ను త్వరలోనే ఎత్తివేస్తామని భరోసా వ్యక్తం చేశారు.
తన సస్పెన్షన్ గురించి ఈ భేటీలో ఎలాంటి చర్చ జరగలేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. కానీ అంతకుముందు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు మాత్రం కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నారని తెలిపారు. తాను బిఆర్ఎస్ లోకి వెళ్తాననే వార్తలను రాజాసింగ్ కొట్టి పారేశారు. తన జీవితంలో ఆ పార్టీలోకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు.
తన నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావు తదితరులందరినీ కలుస్తానని చెప్పారు. కానీ పార్టీ మారేది లేదని అంటూ తాను బిజెపిలో ఉంటానని, ఆ పార్టీ తప్పితే ఇతర పార్టీలలో తాను ఇమడలేనని రాజాసింగ్ తేల్చి చెప్పారు.