పెండింగ్ బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ డా. తమిళసై ఆరు నెలలుగా తాత్సారం చేస్తున్నా ఇప్పుడే అకస్మాత్తుగా ఈ విషయమై సుప్రీంకోర్టు తలుపు తట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సిద్దపడడానికి రాష్ట్రంలోనే అనేక మునిసిపాలిటీలలో చైర్మన్ లు ఎదుర్కొంటున్న అవిశ్వాస తీర్మానాల బెడద అని తెలుస్తున్నది.
ఎన్నికల సంవత్సరం కావడంతో సొంత పార్టీ నేతల తిరుగుబాటు తమకు ఎక్కడ చుట్టుకుంటోందనని అధికార పక్షం ఆందోళన చెందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి 23 చోట్ల అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు.
ఇంకో 12 మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలకు సిద్ధమవుతున్నారు. సొంత పార్టీ వాళ్లనే గద్దె దించేందుకు ఇతర పార్టీల కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు జట్టుకట్టారు. మున్సిపల్ చైర్మన్ లు, వైస్ చైర్మన్ ల అవిశ్వాసం పెట్టే కాల పరిమితిని నాలుగేండ్లకు పెంచుతూ అసెంబ్లీ, కౌన్సిల్ తీర్మానాలు చేశాయి.
ఆరు నెలలుగా ఈ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. దీంతో ఇది చట్టరూపం దాల్చక మేయర్లు, చైర్మన్ల పదవిపై కత్తి వేలాడుతోంది. గవర్నర్ తమిళిసై ఈ బిల్లును ఆమోదించలేదనే అక్కసుతోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తెలుపుతున్నట్లు స్పష్టం అవుతుంది.
బడ్జెట్ ను ఆమోదించేలా గవర్నర్ ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లి చీవాట్లు తిన్న రాష్ట్ర ప్రభుత్వం చివరికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు పెండింగ్ బిల్లుల కోసం సుప్రీంకు వెళ్లడం వెనుక మున్సిపాలిటీల్లో అవిశ్వాసం సెగలేనని స్పష్టమవుతోంది.
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాసం వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. చైర్ పర్సన్ పదవి నుంచి తప్పుకున్న భోగ శ్రావణి బీజేపీ గూటికి చేరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఆమె పనిచేయబోతున్నారు. ఇలాంటి పరిస్థితి మిగతా మున్సిపాలిటీల్లోనూ ఎదురుకాబోతుందని బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది.
అదే జరిగితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని భయపడుతున్నారు. మేయర్లు, చైర్మన్ లపై అవిశ్వాసాలు పెట్టొద్దని స్వయంగా కేటీఆర్ ఆదేశించినా ఫలితం లేకుండా పోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు నచ్చజెప్పినా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పట్టించుకోవడం లేదు.
విద్యా వ్యవస్థకు సంబంధం లేని వ్యాపారవేత్తలు ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు. ఆయా వర్సిటీల ఏర్పాటులో కనీస ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలున్నాయి. ఈ కారణాలతోనే ఆ బిల్లుకు ఆమోదం లభించలేదు. దీంతోనే న్యాయ పోరాటానికి దిగారు.
అయితే, రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ కు బిల్లులు ఆమోదించమని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇస్తుందా? గవర్నర్ అధికార పరిధిలో అసలు తలదూరుస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు ఇది తమ పరిధిలోకి రాదని చెప్తే ప్రభుత్వం ముందున్న దారులేమిటనేది అంతుచిక్కడం లేదు.
అయితే, పంజాబ్ గవర్నర్ కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి ఆమోదం తెలపకపోవడంతో అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి, సానుకూల ఉత్తరువు పొందగలిగింది. గవర్నర్ కేవలం మంత్రివర్గం చెప్పిన్నట్లు నడచుకోవలసిందే అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా గవర్నర్ల నడవడిపై విమర్శలు చెలరేగుతున్న దృష్ట్యా ఇందులో ఇమిడి ఉన్న లోతయిన రాజ్యాంగపరమైన అంశాలను కూడా సుప్రీంకోర్టు పరిశీలించే అవకాశం లేకపోలేదు.