అవినాష్ రెడ్డి కోసం కర్నూల్ లో సిబిఐ… ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత!

Saturday, January 18, 2025

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో వరుసగా సిబిఐ విచారణకు ఏదో ఒక సాకుతో గైరాజారవుతున్న కీలక నిందితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోసం సిబిఐ బృందాలు కర్నూలు చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  దీంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదని ప్రచారం మొదలైంది. అవినాష్‌ అరెస్ట్‌పై కర్నూల్ ఎస్పీకి సీబీఐ లిఖిత పూర్వకంగా సమాచారం అందించినట్లు కర్నూలు నుంచి కథనాలు వెలువడ్డాయి.

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో కర్నూలులో చికిత్సపొందుతున్న తల్లితో కలిసి అవినాష్ ఉంటున్న విశ్వ భారతి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి వద్దకు అవినాష్ రెడ్డి అనుచరులు భారీగా చేరుకున్నారు. గత రాత్రి మీడియా వారిపై కూడా దౌర్జన్యంకు దిగారు.

గత వారం సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు కావడంతో మూడు రోజుల క్రితం మే 22న విచారణకు రావాలని సిబిఐ నోటీసు పంపింది. ఈ నేపథ్యంలో తన తల్లి శ్రీలక్ష్మి కి ఆరోగ్యం బాగోలేదని, మరో పది రోజులు గడువు కావాలని అవినాష్ రెడ్డి రాత్రి సిబిఐను కోరారు. కానీ, అవినాష్ విజ్ఞప్తిని తిరస్కరించిన సిబిఐ కచ్చితంగా విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది.

మరోవైపు విశ్వభారతి ఆస్పత్రిలోనే అవినాష్ రెడ్డి మకాం వేయడంతో కర్నూల్ ఎస్పీని సిబిఐ అధికారులు సోమవారం ఉదయం కలిశారు. అవినాష్ రెడ్డిని లొంగిపొమ్మనమని చెప్పమని కోరినట్లు తెలుస్తున్నది. ఆస్పత్రి ప్రాంగణంలోనే అవినాష్ రెడ్డి ఉండటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ఆస్పత్రి సమీపంలో దుకాణాలను తెరవకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

కర్నూలులో పరిస్థితిపై సిబిఐ ఉన్నతాధికారుల ఆరా తీస్తున్నారు. ఢిల్లీ నుంచి స్థానిక పోలీసు అధికారులతో సీబీఐ ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. కర్నూలులో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ సీబీఐ ఆఫీస్ కు సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

కర్నూలు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు , జిల్లా ఎస్పీకి లిఖిత పూర్వకంగా అవినాష్ రెడ్డి వ్యవహారంపై సమాచారాన్ని అందచేసినట్లు తెలుస్తోంది. వరుసగా మూడుసార్లు విచారణకు హాజరు కాకపోవడంతో అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అధికారం ఉందని సీబీఐ జిల్లా పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది.

మరోవైపు విశ్వభారతి ఆస్పత్రి గేటు దగ్గర వైసీపీ శ్రేణులు బైఠాయించడంతో ఆస్పత్రి ఆవరణలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అవినాష్ తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, శ్రీ లక్ష్మీ కార్డియో సమస్యతో బాధపడుతున్నారని వెల్లడించారు. అవినాష్ రెడ్డి తల్లికి బీపీ తక్కువగా ఉన్నందున మరికొన్ని రోజులు ఐసీయూలో చికిత్స అందించాలని వైద్యులు పేర్కొన్నారు

ఒక వంక, సిబిఐ బృందం కర్నూల్ రావడంతో హైడ్రామా అక్కడ కొనసాగుతుండగా, మరోవంక ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయ‌మూర్తులు జెకె మ‌హేశ్వరి, పీఎస్ న‌ర‌సింహ‌లతో కూడిన వెకేష‌న్ బెంచ్ ముందు అవినాశ్ తన బెయిల్ పిటిష‌న్‌ను మెన్షన్ చేయనున్నారు.

గ‌తంలో హైకోర్టు వేకేష‌న్ బెంచ్ ను త‌న బెయిల్ పిటిష‌న్ విచారించేలా ఆదేశించాల‌ని సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిష‌న్ విచార‌ణ తేదీని సుప్రీంకోర్టు ఖ‌రారు చేయ‌లేదు. జూన్ రెండోవారంలో విచార‌ణ‌కు అనుమ‌తిస్తామ‌ని చెప్పిన సీజేఐ డీవై చంద్రచూడ్ ధ‌ర్మాస‌నం తెలిపింది.

ఈ రోజు సీబీఐ అరెస్ట్ చేసే అవ‌కాశం ఉన్నందున మ‌ళ్లీ సుప్రీం వెకేష‌న్ బెంచ్ ముందు త‌న బెయిల్ పిటిషన్‌ను అవినాశ్ ఉంచారు. ఇక ఆయన పిటిషన్‌ను వ్యతిరేకించేందుకు వివేకా కూతురు సునీత తరుఫు లాయర్లు సైతం సిద్ధంగా ఉన్నారు.ఇలా ఉండగా, అవినాష్ రెడ్డి  అరెస్ట్‌కు ఎస్పీ సహకరించడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆరోపించారు. తాడేపల్లి ఆదేశాలు ఎస్పీ పాటిస్తున్నారని ఆరోపించారు. పులివెందుల కిరాయి మూకల అధీనంలో కర్నూలు హాస్పటల్ ఉందంటే ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

వివేకా హంతకుడిని పోలీసులు కాపాడటమా ఏపీ పోలీసుల‌కు ఇంత కన్నా అవమానం లేదని పేర్కొంటూ డీజీపీ, డీఐజీ వెంటనే కలగజేసుకోవాలని డిమాండ్ చేశారు. అవినాష్ రెడ్డిని సీబీఐకు అప్పజెప్పలని స్పష్టం చేశారు.  తల్లి అనారోగ్యం నిజమైతే అవినాష్ తల్లిని హైదరాబాద్ అపోలో లాంటి హాస్పటల్‌కు తీసుకెళతారని, కర్నూలులో చేర్చరని బోండా ఉమా చెప్పుకొచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles