అవినాష్ రెడ్డి కీలక నిందితుడు… సిబిఐ స్పష్టం

Saturday, January 18, 2025

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో  ఇప్పటివరకు సహనిందితుడిగా పేర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి మొదటిసారిగా కీలక నిందితులుగా స్పష్టం చేసింది. కేసు విచారణను తప్పుదారి పట్టించేందుకు అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కరరెడ్డి కుట్ర పన్నారని,  సాక్ష్యాల చెరిపివేతలో వారిద్దరి పాత్ర ఉందని సిబిఐ వెల్లడించింది.

అంతే కాదు, ఈ కేసులో అవినాష్ రెడ్డి 8వ నిందుతుడు అంటూ ఒక నంబరును కూడా సీబీఐ ఇచ్చింది. ప్రస్తుతం అరెస్ట్ అయి జైలులో ఉన్న భాస్కరరెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను వ్యతిరేకిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో సిబిఐ ఈ సంచలన అంశాలను వెల్లడించింది.

తన ఆరోగ్యం దృష్యా బెయిల్ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి నాంపల్లి కోర్టును ఆశ్రయించగా సిబిఐ దాఖలు చేసిన  కౌంటర్ లో కీలక అంశాలను ప్రస్తావించింది. సీబీఐ విచారణకు సహకరిస్తున్నట్టు భాస్కర్ రెడ్డి చెప్పడం అబద్దం. ఒకవేళ ఆయనకు బెయిల్ ఇస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా తేల్చి చెప్పింది.

వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల ధ్వంసం వెనక భారీ కుట్రపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంటూ ఇటువంటి దశలో ఏప్రిల్ 16 నుంచి జైల్లో ఉన్నంత మాత్రాన బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ అధికారులు కోర్టుకు తెలియజేశారు. ఈ క్రమంలో తదుపరి విచారణను కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది.

హత్య అనంతరం జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ  ఎన్.శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాష్ రెడ్డి హత్యస్థలికి చేరుకున్నారని, ఆ రోజు ఉదయం 5:20 గంటలకు ముందే అవినాష్ రెడ్డి, శివశంకర్‌రెడ్డిలతో గంగిరెడ్డి మాట్లాడినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. కేసు పెట్టొద్దని, పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాష్, శివశంకర్ రెడ్డి చెప్పారని వివరించారు.

సీబీఐకి, కోర్టుకు ఏమీ చెప్పొద్దని దస్తగిరిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని అంటూ దస్తగిరిని ప్రలోభపెట్టేందుకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్‌రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారని సీబీఐ అధికారులు కౌంటర్‌లో పేర్కొన్నారు. పరోక్షంగా వైఎస్ జగన్ ప్రభుత్వం మద్దతు వారికి ఉన్నట్లు పేర్కొంటూ  కడప, పులివెందుల ప్రాంతాల్లో భాస్కర్‌రెడ్డి చాలా ప్రభావితం చేయగల వ్యక్తి అని తెలిపారు.

అరెస్టు చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు, ప్రదర్శనలే భాస్కర్‌రెడ్డి బలానికి నిదర్శనమని పేర్కొంటూ భాస్కర్‌రెడ్డి బయట ఉంటే చాలు పులివెందుల సాక్షుల ప్రభావితమైనట్లేనని సిబిఐ స్పష్టం చేసింది. భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే ఎన్ని షరతులు పెట్టినా నిరుపయోగమేనని తేల్చి చెప్పింది. సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తే కేసుకు పూడ్చలేని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

కడప ఎస్పీ సమాచారం మేరకు భాస్కర్‌రెడ్డిపై గతంలో మూడు కేసులున్నాయని, పేలుడు పదార్థాల చట్టం సహా మూడు కేసులు గతంలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారని సిబిఐ ఈ సందర్భంగా ప్రస్తావించింది. అయితే, రెండు కేసులు వీగిపోగా.. మరొకటి తప్పుడు కేసుగా తేల్చి కొట్టివేశారని అంటూ కేసుల ప్రకారం భాస్కర్‌రెడ్డి నేపథ్యం ప్రశ్నార్థకంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.

మరోవైపు వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని వివేకా కుమార్తె సునీత కోరుతూ.. సీబీఐ కోర్టులో లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. వివేకా హత్య కేసు లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉందని, భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేస్తారన్నారు. భాస్కర్‌రెడ్డి ప్రమేయంపై పలువురు సాక్షుల వాంగ్మూలాలను సునీత ప్రస్తావించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles