అవినాష్ రెడ్డికి తాజా సిబిఐ నోటీసుతో `అరెస్ట్’ కలవరం!

Saturday, January 18, 2025

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ చేయక తప్పదని హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా స్పష్టం చేస్తూ, తీరా ఉన్నత న్యాయస్థానాలు అందుకు అభ్యంతరాలు లేవని చెప్పిన తర్వాత మౌనంగా ఉంటూ వస్తున్న సీబీఐ అకస్మాత్తుగా వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సోమవారం మరోసారి నోటీసులు జారీ చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొనడంతో ఈ పర్యాయం అరెస్ట్ తప్పదా? అని అధికార పార్టీలో కలవరం చెలరేగుతుంది. వివేకా హత్యకేసులో ఇప్పటికే ఆరుసార్లు సీబీఐ అధికారులు అవినాష్‌ రెడ్డిని విచారించారు. తాజాగా మరోసారి ఆయన నోటీసులు జారీచేశారు.

మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్‌ కుమార్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది.  సిబిఐ నోటీసులు జారీ చేసినప్పుడల్లా హైకోర్టులో ఏదో ఒక పిటీషన్ వేస్తూ కాలయాపన చేస్తూ వస్తున్న అవినాష్ రెడ్డి ఈ పర్యాయం ఏమిచేస్తారేమో అన్న ఆసక్తి ఏర్పడింది. విచారణకు హాజరవుతారా? లేదా మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తేనే చాలా విషయాలు తెలుస్తాయని ఇప్పటికే సీబీఐ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. అదే విధంగా ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేనప్పటికీ సీబీఐ అవినాష్ రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా నోటీసులు జారీ ఇవ్వడంతో అరెస్టుపై మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి.

మరోవంక, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు వివేకా హత్య కేసు డైరీని కోర్టుకు సమర్పించారు. కేసు విచారణ కీలక దశలో ఉందని, ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పై బయటికొస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని సీబీఐ వాదించింది.

వివేకా హత్య కేసులో ఉదయ్ ప్రమేయంపై ఆధారాలు ఉన్నాయని, అందుకే అరెస్ట్ చేశామని సీబీఐ వెల్లడించింది. అదే విధంగా ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ మరోసారి కోర్టుకు తెలిపింది. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది.

ఏప్రిల్ 14న అరెస్ట్ చేసిన ఉదయ్ కుమార్ రెడ్డి  అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని సీబీఐ వాదించింది. వివేకానందరెడ్డి హత్యా స్థలంలో సాక్ష్యాలను అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ధ్వంసం చేశారని తెలిపింది. బెయిల్ ఇస్తే ఉదయ్ కుమార్ రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేసి సాక్షులను బెదిరించే అవకాశం ఉందని సీబీఐ పేర్కొంది.

సోమవారం మధ్యాహ్నం ఎంపీ అవినాష్ కడపకు బయలుదేరి వెళ్లారు. అయితే ఈయన కడపకు చేరుకున్న గంట వ్యవధిలోనే నోటీసులు వచ్చినట్లు వ్యక్తిగత సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న ఎంపీ హైదరాబాద్‌కు తిరుగుపయనం అయ్యారు. దీంతో అప్పుడే రావడం.. మళ్లీ బయల్దేరడంతో ఏం జరుగుతోందో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇకపోతే, అవినాష్ ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టులో విచారణ అటు ఎంపీ,  ఇటు డా. సునీతా రెడ్డి, సీబీఐ తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. దానితో అవినాష్ రెడ్డికి తాత్కాలిక బెయిల్ ఇస్తూ  హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో సీబీఐ విచారణను తప్పించుకొనే న్యాయపరమైన మార్గాలు దాదాపుగా మూసుకు పోయిన్నట్లుగా న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles