మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చివరిఘట్టంకు చేరుకోబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల అరెస్టు తప్పనిసరనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ వారం వారిద్దరిని వేర్వేరుగా మరోసారి సిబిఐ చేపట్టనున్న విచారణ కీలకంగా మారే అవకాశం ఉంది.
వివేక హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్ పై సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ చూస్తే వీరిద్దరి అరెస్ట్ అనివార్యం అని పోలీస్, న్యాయవాదవర్గాలలో బలంగా వినిపిస్తున్నది.
వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు ముందు, తరువాత వైయస్ భాస్కర్ రెడ్డి నివాసంలో నిందితులంతా సమావేశమైనట్టు గూగుల్ టేక్ అవుట్ ద్వారా స్పష్టమైన ఆధారాలు లభించినట్లుగా సిబిఐ తన కౌంటర్ పిటిషన్ లో పేర్కొనడం గమనార్హం. ఈ విషయాన్ని పేర్కొన్న సిబిఐ వారిద్దరిని అరెస్ట్ చేయని పక్షంలో హైకోర్టు ముందు పెను సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వారిద్దరి అరెస్ట్ జరిగితే ఏమిచేయాలి అన్న ప్రశ్న ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వెంటాడుతున్నట్లు చెబుతున్నారు. వారిని అరెస్ట్ చేస్తే తిరగబడతామనే ధోరణిలో కడప జిల్లాలోని వైసిపి శ్రేణులు మాట్లాడుతున్నారు. కొందరు ఎమ్యెల్యేలు పదవులకు రాజీనామాలు కూడా ఇస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు.
నిజంగా అదేవిధంగా జరిగి శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో అధకారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వమే అప్రదిష్ఠకు గురికావలసి వస్తుంది. అంతకన్నా జగన్ పై కోర్టులలో ఉన్న సుమారు డజన్ సిబిఐ, ఈడీ కేసులపై వీటి ప్రభావం ఉండే అవకాశం ఉంటుందనే ఆందోళన జగన్ శిబిరంను ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెబుతున్నారు.
పలురకాల వ్యూహాలను అనుసరిస్తూ ఈ కేసుల విచారణ కోర్టులలో వేగవంతం కాకుండా గత తొమ్మిదేళ్లుగా జగన్ చేసుకోగలిగారు. ఇప్పుడు సిబిఐ అరెస్టులను తప్పుబడుతూ ఆందోళనలకు దిగితే ఈ సిబిఐ కేసులు వేగవంతం అయ్యే అవకాశాలు ఉండవచ్చనే ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తున్నది.
అందుకనే అరెస్టులు జరిగినప్పుడు సంయమనంతో వ్యవహరించాలని జగన్ కు న్యాయనిపుణులు సూచించే అవకాశం ఉంది. ఇప్పటివరకు కేసుల విచారణ వేగం పుంజుకోకుండా సహకరించిన మోదీ ప్రభుత్వం సహితం ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇంకా ఆదుకొనే ప్రయత్నం చేయకపోవచ్చనే ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
వీరిద్దరూ జైలులో ఉంటె ఎన్నికల సమయంలో పులివెందులలో ఎన్నికల నిర్వహణ సీఎం జగన్ కు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చే మెజార్టీతోనే కడప ఎంపీ సీటు కూడా సునాయానంగా గెల్చుకొంటూ వస్తున్నారు. వీరిద్దరూ జైలులో ఉండి, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే బొటాబొటి ఆధిక్యతతో తాను పులివెందుల నుండి గెలుపొందిన కడప ఎంపీ సీట్ గెల్చుకోవడం సమస్యకావచ్చనే ఆందోళన వెంటాడుతుంది.