ఇన్నాళ్లూ కాస్త బింకంగా కనిపించిన అవినాష్ రెడ్డి అండ్ కోటరీ కాస్త ఆత్మరక్షణలో పడిపోయింది. అరెస్టును తప్పించుకోవడం అసాధ్యం అని బోధపడిన తర్వాత.. న్యాయమార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలు సీబీఐ విచారణకు హైదరాబాదుకు వచ్చిన అవినాష్ రెడ్డి, తనను అరెస్టు చేయకుండా విచారణ సంస్థను ఆదేశించాలంటూ కోర్టును ఆశ్రయించిన వైనం చిత్రంగా కనిపిస్తోంది.
‘అవినాష్ రెడ్డి హత్య వెనుక కీలక సూత్రధారి’ అని సీబీఐ ఇప్పటిదాకా చెప్పలేదు. ఆయనను ఖచ్చితంగా అరెస్టు చేస్తామనే సంగతి కూడా చెప్పలేదు. హత్యకు ముందు వెనుక.. ప్రధాన నిందితులు అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని.. హత్య గురించిన సమాచారం ఆయనకు ముందే తెలుసునని మాత్రమే సీబీఐ తమ కౌంటర్లో పేర్కొంది. జస్ట్ ఈ వ్యాఖ్య అరెస్టుకు దారితీసేస్తుందని అనడానికి లేదు. అదే నిజమైతే.. రెండోసారి విచారణకు వచ్చినప్పుడే ఆయన అరెస్టు జరిగి ఉండాలి. అలాంటిది.. ఇప్పుడు ఆయన ఏకంగా హైకోర్టు తలుపు తట్టి తనను అరెస్టు చేయకుండా సీబీఐను ఆదేశించాలని కోరుతున్నారంటే.. ఆయనలో అరెస్టు భయం పుష్కలంగా ఉన్నట్టు అర్థమవుతోంది.
అందుకు అవినాష్ చెబుతున్న లాజిక్ చిత్రమైనది. తనకు 160 సిఆర్పీసీ నోటీసు ఇచ్చారు గనుక.. అరెస్టు చేయకూడదని, చేయకుండా సీబీఐను ఆదేశించాలనేది ఆయన రిట్ పిటిషన్ సారాంశం. సాక్షులుగా వారికి తెలిసిన వివరాలను నమోదు చేసుకోవడానికి ఎవరికైనా సరే 160సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి పిలిపించడం చాలా సాధారణమైన సంగతి. అంతమాత్రాన వారికి కేసుతో సంబంధం ఉందని గానీ, లేదని గానీ అర్థం కాదు. వారి ద్వారా రాబట్టగలిగిన వివరాలను రాబడతారు. మిగిలిన సాక్షులనుంచి కూడా వచ్చే వివరాలను అన్నీ సమన్వయ పరచుకున్న తర్వాత.. వారి పాత్ర మీద అదనంగా అనుమానం కలిగితే.. అప్పుడు అరెస్టు చేస్తారు.
అయితే మిగిలిన సాక్షులు అందించిన వివరాలు అన్నీ ఎలా ఉన్నాయో తెలియకుండానే.. తనను 160 కింద పిలిచారు గనుక.. అరెస్టు చేయనే కూడదు అని లాజిక్ మాట్లాడడం అవినాష్ రెడ్డి అమాయకత్వం లాగా కనిపిస్తోంది. హత్యతో నేరుగా సంబంధం ఉన్న నిందితులు సీబీఐకు వివరించిన సంగతులన్నిటినీ పక్కన పెట్టి.. హత్యాస్థలంలో దొరికిన లేఖను గురించి విచారించడం లేదని అవినాష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ లేఖ వెనుక, అసలు బనాయించిన వ్యక్తుల బాగోతం కూడా సీబీఐ రాబట్టిందంటే.. ఇక ఆ మాటెత్తడం మానేస్తారేమో. మొత్తానికి బాబాయి వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి.. సీబీఐ అరెస్టునుంచి తప్పించుకోవడం అసాధ్యం అని పలువురు భావిస్తున్నారు.
అవినాష్ కోరికలోనే అలవిమాలిన అరెస్టు భయం!
Saturday, November 16, 2024