అవినాష్ కు `సుప్రీం’లో షాక్ .. ముందస్తు బెయిల్ పై స్టే!

Saturday, January 18, 2025

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో పెద్ద షాక్ తగిలింది. ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దంటూ సిబిఐని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వివేకా కుమార్తె డా. సునీతారెడ్డి వేసిన పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

అయితే, అవినాష్ రెడ్డి అభ్యర్ధనలపై సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని మాత్రం సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తే అవినాశ్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారంటూ ధర్మాసనం దృష్టికి అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది తీసుకెళ్లారు. అంతేకాదు, ఈ కేసుకు సంబంధించి పేపర్ బుక్ కూడా తమ వద్ద లేదని, సునీత పిటీషన్ లో ఏముందో కూడా తమకు తెలియదని చెప్పారు.

 పేపర్ బుక్ తమ వద్ద ఉంటే ఇప్పుడే వాదనలు వినిపించేవాళ్లమని చెబుతూ సోమవారం వరకు విచారణను వాయిదా వేశారు కాబట్టి, సోమవారం తమ వాదనలను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో, సోమవారం వరకు అవినాశ్ ను అరెస్ట్ చేయవద్దని సుప్రీం ఆదేశించింది.

తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించడంతో అవినాశ్ ను అరెస్ట్ చేసేందుకు సీబీఐకి అవకాశం లభించిందనే చెప్పుకోవాలి. అయితే, సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని సుప్రీం ఆదేశించడంతో అవినాశ్ కు స్వల్ప ఊరట లభించినట్టయింది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వాఖ్యానాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శిబిరంలో ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తున్నది.

హైకోర్ట్ తీర్పు చాలా దారుణమని, ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించడం  కలకలం రేపుతోంది. విచారణ సందర్బంగా  అవినాశ్ మధ్యంతర బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  చంద్రచూడ్ పేర్కొనడం గమనార్హం. ఇటువంటి ఉత్తర్వులు చూశారా అని అవినాశ్ లాయర్‌ను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది

సోమవారం వరకు అవినాష్‍రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూనే, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీం కోర్టు స్టే విధించడం గమనార్హం. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పేలవంగా ఉన్నాయన్న సుప్రీం కోర్టు, ఈ వ్యవహారంపై సోమవారం మరోసారి విచారణ చేపడతామని ప్రకటించింది. దీంతో ఈ నెల 25న హైకోర్టులో జరగడానికి ముందే అవినాష్ రెడ్డి వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది.

దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టులో విచారణ సమయంలో చేపట్టాల్సిన అంశాలను బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోవడం సరికాదని సునీత తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కేసులోని మెరిట్స్ ప్రకారం లేవని ఆరోపించారు.

హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని, హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించిందని, ఈ నెల 30 లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కూడా సుప్రీం ఆదేశించిందని గుర్తు చేశారు.

ఈ పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థ సీబీఐపై ఎలాంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత హైకోర్టుపై ఉందని పేర్కొన్నారు. కానీ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు దర్యాప్తునకు అవరోధం కల్గించేలా ఉన్నాయని సిద్ధార్థ లూద్రా వాదించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles