అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి, కస్టడీకి తీసుకొని ప్రశ్నించాలన్న సిబిఐ

Thursday, December 19, 2024

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి దురుద్దేశ్యపూరితంగానే దర్యాఫ్తుకు సహకరించడం లేదని, విచారణ సందర్భంగా సమాధానాలు దాటవేశారని, వాస్తవాలు చెప్పలేదని పేర్కొంటూ అతనిని అరెస్ట్ చేసి, కస్టడీకి తీసుకొని ప్రశ్నించాల్సిన అవశ్యత ఉందని సిబిఐ  స్పష్టం చేసింది.

అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కేసుకు సంబంధించి సీబీఐ తెలంగాణ హైకోర్టులో ఇటీవల దాఖలు చేసిన కౌంటర్ లో కీలక అంశాలను పొందుపరిచింది. ఆయన అనుచరుల వల్లే దర్యాఫ్తుకు ఆటంకం కలిగిందని, అతనికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ముందుకు రావడం లేదని తెలిపింది.

అవినాశ్ను అరెస్ట్ చేసి కస్టడీలో ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అవినాశ్‌రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ర్యాలీలు జరపడం.. సాక్షులను ప్రభావితం చేయడమేనని సీబీఐ పేర్కొంది.

దర్యాఫ్తును, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని చెబుతూ అవినాశ్ కు నేర చరిత్ర ఉందని, నాలుగు క్రిమినల్ కేసులు అతని పైన ఉన్నట్టు సిబిఐ తెలిపింది.  విచారణ నుంచి తప్పించుకునేందుకే అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు దర్యాప్తు సంస్థ భావిస్తోంది. ఈ కేసులో గొడ్డలి ఎక్కడుందో కస్టడీ విచారణలో తెలుసుకోవాలని సీబీఐ తెలిపింది.

హత్యకు రూ.4 కోట్ల లావాదేవీలపై అవినాష్ రెడ్డి ని ప్రశ్నించాలని సిబిఐ కోరింది. సునీల్ యాదవ్ తో అవినాష్ రెడ్డికి సంబంధంమేంటో తెలియాలని పేర్కొన్నది. వివేకా పీఏ కృష్ణారెడ్డి, సీఐ శంకరయ్య, గంగాధర రెడ్డి వంటి సాక్షులను ప్రభావితం చేసినట్లు వెల్లడైందని సిబిఐ  కోర్టుకు తెలిపింది.

అలాగే హత్య తర్వాత సాక్ష్యాలను చెరిపి వేయడం ప్రమేయం ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపింది. కుట్రలో భాగంగా ఆధారాలు చెరిపేశారని చెబుతూ  సునీల్ – అవినాశ్ మధ్య సంబంధం తెలియాల్సి ఉందని, కుట్రలో ఎవరెవరి ప్రమేయం ఉందో వెల్లడి కావాల్సి ఉందని పేర్కొన్నారు. మార్చి 15న అవినాశ్ రెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియాల్సి ఉందని పేర్కొంది.

‘‘హత్యకు రూ.4 కోట్ల లావాదేవీలపై అవినాశ్ రెడ్డి విచారణలో తేల్చాలి. సునీల్ యాదవ్‌తో అవినాశ్ రెడ్డికి సంబంధమేంటో తెలియాలి. హత్య రోజున అవినాశ్ ఇంటికి సునీల్ ఎందుకెళ్లాడో తేల్చాలి. హత్య కుట్రలో ఇంకా ఎవరి ప్రమేయం ఉందో తెలుసుకోవాలి. మార్చి 15న అవినాశ్ రెడ్డి ఎక్కడెక్కడున్నారో నిర్ధారించాలి” అంటూ సిబిఐ హైకోర్టుకు నివేదించింది.

“నేరాన్ని తనపై వేసుకుంటే రూ.10 కోట్లు.. ఇస్తామన్నారని గంగాధర్రెడ్డి అన్నారు. గంగాధర్రెడ్డి వాంగ్మూలంలో వాస్తవం తేల్చాలి. దస్తగిరిని ఓబుల్ రెడ్డి, భరత్ యాదవ్ ఎందుకు కలిశారో తేలాలి. అవినాశ్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలానికి సాక్షులు ముందుకు రావట్లేదు. అవినాశ్ అనుచరుల వల్ల దర్యాప్తునకు ఆటంకం కలిగింది. అవినాశ్ రెడ్డి దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేస్తున్నారు” అంటూ పేర్కొన్నది. 

వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాలు ధ్వంసంలో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని సిబిఐ ఆరోపిస్తుంది. హత్యలో సునీత, రాజశేఖర్ రెడ్డి, శివప్రకాశ్ రెడ్డి ప్రమేయంపై ఆధారాల్లేవని సిబిఐ స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదని, అవినాష్‌రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించాలని సీబీఐ కోర్టును కోరింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles