అవినాశ్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు… అరెస్ట్ తప్పదా!

Wednesday, December 18, 2024

వైఎస్‌ఆర్‌సిపి నేత వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ విచారణకు సంబంధించి ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశించలేమని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.

తన విచారణపై స్టే ఇవ్వాలని అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో అవినాష్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. సీబీఐ విచారణకు సహకరించాలని అవినాశ్‌రెడ్డికి హైకోర్టు ఆదేశాలివ్వడం గమనార్హం.  అరెస్ట్‌ చేయొద్దని తాము చెప్పలేమని అవినాష్ రెడ్డికి హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  అవినాష్ రెడ్డిని విచారించుకోవచ్చని, అందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. విచారణ ఆపాలని ఆదేశించలేం అంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేసింది హైకోర్టు.

అరెస్ట్ చేయొద్దని కోర్టు చెప్పలేదని గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. అవసరం అనుకుంటే విచారణ సందర్భంగా కస్టడీలోకి తీసుకోవాలి అనుకుంటే అందుకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. దానితో ఆయన అరెస్ట్ అనివార్యంగా తోస్తున్నది. పిటీషన్ పై తీర్పు తర్వాత.. కోర్టుకు ఇచ్చిన ఆధారాలను సీబీఐకి తిరిగి ఇచ్చేసింది.

సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని, విచారణపై స్టే విధించాలని కోరుతూ అవినాశ్ రెడ్డి కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే విచారణకు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించింది. కానీ, విచారణ సమయంలో న్యాయవాది అస్సలు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది.

అంతేకాకుండా ఆడియో, వీడియో రికార్డు కూడా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అవినాశ్‌రెడ్డిని ఇప్పటికే నాలుగుసార్లు పిలిపించి ప్రశ్నించింది. ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి పైనా దృష్టి సారించింది. తండ్రీకొడుకులిద్దరినీ కలిపి ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కీలక నిందితులని, అరెస్టు చేయడం ఖాయమని సీబీఐ తెలంగాణ హైకోర్టుకే స్పష్టం చేసింది.

వాస్తవానికి, హైకోర్టు జోక్యం చేసుకోకపోతే ఈనెల 10వ తేదీనే అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసేదని అందరూ భావించారు. అవినాశ్‌ రెడ్డి పిటిషన్‌పై తీర్పు వెలువడేదాకా ఆయనను అరెస్టు చేయవద్దని హైకోర్టు సీబీఐని ఆదేశించింది.

ఇలా ఉండగా, హైకోర్టు శుక్రవారం ఉదయం అవినాష్ రెడ్డి పిటీషన్ పై తీర్పు ఇవ్వనున్నట్లు తెలియడంతో రాష్త్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హడావుడిగా ఢిల్లీకి ప్రయాణమై వెళ్లడం ప్రాధాన్యతను సంతరింప చేసుకుంది. సిబిఐ దూకుడుగా వ్యవహరిస్తుందనడంతో ప్రధాని సహాయం కోరనున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సాయంత్రం ఆయన ప్రధానిని కలుస్తున్నారు. మరోవంక, హోమ్ మంత్రి అమిత్ షాను కలిసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles