దేశంలోనే అగ్రశ్రేణి ఫార్మా కంపెనీలలో ఒకటైన అరబిందో ఫార్మా డైరెక్టర్, యజమాని తనయుడు శరత్ చంద్ర రెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి, ప్రస్తుతం జైలు జీవితం గడపడం ఏపీ రాజకీయాలలో కలకలం రేపుతోంది.
ఎందుకంటే, అతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తర్వాత వైసిపిలో కీలక వ్యక్తిగా భావిస్తున్న, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సమీప బంధువు కావడమే. విజయసాయిరెడ్డి అల్లుడుకు స్వయానా అన్న కావడం గమనార్హం.
అందుకనే, వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏపీలో ప్రభుత్వ అండదండలతో అరవింద్ ఫార్మా తన వ్యాపారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసుకొంటూ ఉండడంలో ఈ మొత్తం వ్యవహారంలో అసలు సూత్రధారి విజయసాయిరెడ్డి అందరూ భావిస్తున్నారు.
విజయసాయిరెడ్డి కారణంగానే శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే జైలు జీవితంతో విసుగు చెందిన శరత్ అప్రూవర్ గా మారారని, మామ విజయసాయిరెడ్డి ఆర్ధిక కార్యకలాపాల బాగోతం అంతా దర్యాప్తు సంస్థల ముందు వెళ్లగక్కారని వైసీపీ `అసమ్మతి ఎంపీ’ రామకృష్ణంరాజు `బాంబు’ పేల్చారు.
వివేకానంద రెడ్డి హత్య కె సులో షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారి, హత్యలో ఎవరెవరు పాల్గొన్నారన్నది పూసగుచ్చినట్లు వివరించినట్లుగానే ప్రస్తుతం జైల్లో ఉన్న అల్లుడు మామ గుట్టు రట్టు చేసినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయని ఆయన వెల్లడించారు. అదే నిజమైతే, రాజకీయంగా పెను దుమారం రేపే ప్రమాదం ఉంది. అయితే, ఈ ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు మాత్రం మౌనం వహిస్తున్నాయి.
అయితే, జుగుస్సాకరమైన ట్వీట్లను చేస్తున్న విజయ సాయి రెడ్డిని రాజ్యసభ ప్యానల్ చైర్మన్ పదవి నుంచి తప్పించిన ఉప రాష్ట్రపతి, వారం రోజుల లోపుగానే తిరిగి నియమించడం గమనార్హం. విజయసాయి రెడ్డి చేసిన ట్విట్లపై తాను కూడా ఫిర్యాదు చేసిన తర్వాతనే ఉపరాష్ట్రపతి ఆ విధంగా చేశారని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు.
అయితే, బిజెపికి పూర్తి స్థాయి బలం లేనందున రాజ్యసభలో తమ పార్టీ మద్దతు అనివార్యం అనే బలహీనతను ఆసరా చేసుకొని, రాజకీయ లాబీ జరపడం ద్వారా ఆయన తిరిగి ప్యానెల్ చైర్మన్ కాగలిగారనే ప్రచారం జరుగుతుంది.