ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అకస్మాత్తుగా అలజడితో కనిపిస్తున్నారు. రెండు రోజులుగా తన పర్యటన కార్యక్రమాలు అన్నింటిని రద్దు చేసుకొని, ఢిల్లీకి ప్రయాణం కావడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది. వాస్తవానికి ఈ నెల 30న ఢిల్లీ వెళ్ళవలసిన కార్యక్రమం ఉంది. కానీ రెండు రోజులు ముందుగానే హడావుడిగా బయలుదేరడం, అధికారికంగా ఎటువంటి కార్యక్రమం కూడా అక్కడ లేకపోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యా కేసులో కడప ఎంపీ, తనకు వరుసకు సోదరుడైన వైఎస్ అవినాష్ రెడ్డిని శనివారం హైదరాబాద్ లో సిబిఐ విచారిస్తున్న సమయంలోనే ఆయన ఢిల్లీకి ప్రయాణం కావడం ప్రాధాన్యత సంతరింప చేసుకోండి. మూడున్నరేళ్లుగా అవినాష్ ను సిబిఐ విచారించకుండా చూడగలిగిన ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశంతో కేసు పరిధిని ఏపీ నుండి తెలంగాణకు మార్చడం, వేగంగా దర్యాప్తు అధికారులు అవినాష్ పై దృష్టి సారించడంతో జగన్ ఆందోళన చెందుతున్నట్లు అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
గురువారం తన మంత్రివర్గంలో కీలకమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు, పార్టీ ఎమ్యెల్యే కూడా అయినా కుమారుడి వివాహంకు హైదరాబాద్ లో హాజరు కావలసి ఉంది. వివాహం తర్వాత గుంటూరు జిల్లా పొన్నూరులో పర్యటింపవలసి ఉంది. ఆ రెండు కార్యక్రమాలను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. అదేమంటే, ఆరోగ్య శాఖపై సమీక్ష కోసం అన్నారు. ఈ సమీక్ష కోసం పర్యటనలు రద్దు చేసుకోవడం ఎవ్వరికీ అంతుబట్టడం లేదు.
ఇక, శనివారం విశాఖపట్నంలో శారదాపీఠం వార్షికోత్సవానికి జగన్ హాజరు కావాల్సి ఉంది. రదాపీఠాధిపతి స్వరూపానందకు జగన్ ప్రభుత్వంలో అంతులేని ప్రాధాన్యత ఇస్తూ ఉండడం, ఆయనను దాదాపు `సర్కారీ సాధువు’గా పరిగణిస్తూ సీనియర్ అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సహితం ఆయన ఆశీస్సులకోసం వెడుతూ ఉండటం జరుగుతున్నది. అటువంటి ముఖ్యమైన కార్యక్రమం కూడా జగన్ రద్దు చేసుకోవడం ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు స్పష్టం అవుతున్నది.
జగన్ ఆందోళనకు రాజకీయ, పరిపాలన సంబంధ కారణా కాకపోవచ్చని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అవినాష్ రెడ్డిపై సిబిఐ దృష్టి సారించడలుమే కారణంగా భావిస్తున్నారు. సిబిఐ ఈ విషయంలో మరింత లోతుగా వెడితే వ్యక్తిగతంగా తాను సహితం పెను ముప్పు ఎదుర్కోవలసి వస్తుందనే ఆందోళనలో ఉన్నట్లు కూడా చెబుతున్నారు.
ఇప్పటి వరకు అన్ని ఆపదల నుండి తనకు రక్షగా ఉంటూ వస్తున్న మోదీ ప్రభుత్వాన్నే ఈ విషయంలో సహితం గట్టెక్కించమని కోరడానికి బయలుదేరినట్లు ఈ సందర్భంగా తెలుస్తున్నది.