ఒక వంక పెదనాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణకు శుక్రవారం హాజరు కావలసి ఉండగా, తనను సిబిఐ అరెస్ట్ చేయకుండా ఆదేశం ఇవ్వాలని కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గురువారం హైకోర్టును ఆశ్రయించడం కలకలం రేపుతోంది. ఇప్పటికే రెండుసార్లు సిబిఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి ఈ సారి తనను అరెస్ట్ చేయడంకోసమే పిలిచినట్లు భావిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
సిబిఐ ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ హైకోర్టులో ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు తనకు 160 సీఆర్పీసీ కింద సీబీఐ నోటీసులు ఇచ్చిందని, ఈ నోటీసుల ప్రకారం తనను అరెస్ట్ చేయకూడదని కోర్టు సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు సమర్పించిన పిటీషన్ లో అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. కాగా రేపు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ఉన్న నేపథ్యంలో కోర్టుకెళ్లడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పైగా, విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. అంతేకాదు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని వైఎస్ అవినాశ్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. కడప జిల్లాలోని వేంపల్లెలో వైసీపీ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఈ నెల 10న విచారణకు రావాల్సిందిగా నాకు సీబీఐ నోటీసు ఇచ్చింది. 12న కడపకు విచారణకు రావాల్సిందిగా మా తండ్రికి నోటీసు ఇచ్చింది’ అని తెలిపారు.
తొలుత, ఎంపీ అవినాశ్‌రెడ్డిని హైదరాబాదుకు, భాస్కర్‌రెడ్డిని కడప సెంట్రల్ జైలు వద్దకు సోమవారం విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసింది. తండ్రీ కొడుకులను ఒకేరోజు విచారణకు పిలవడం వైసీపీలో సంచలనం రేకెత్తించింది. అయితే తనకు ముందస్తు కార్యక్రమాలు ఉండటం వలన సోమవారం విచారణకు హాజరుకాలేనని ఎంపీ సీబీఐ అధికారులు లేఖ రూపంలో తెలియజేశారు.
దీనికి ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకూ సీబీఐ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. చివరకు తండ్రీ కొడుకుల విచారణ తేదీలను సీబీఐ మార్చింది. ఈ మేరకు 10న హైదరాబాదులో విచారణకు కొడుకు వైఎస్ అవినాశ్‌రెడ్డిని, 12న కడపలో తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని రావాలని నోటీసులు ఇచ్చింది.
వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ 3 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారాడు. మరి రానున్న రోజుల్లో సీబీఐ విచారణలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయో చూడాలి