అమెరికా వత్తిడులతో డ్రోన్ ల ఒప్పందం చేసుకున్న మోదీ!

Wednesday, January 22, 2025

తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఒక్క అవినీతి మారక కూడా లేదంటూ దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ప్రచారం చేసుకొంటున్నారు. అయితే, ఇప్పటికే రక్షణ రంగంలో జరిగిన బోఫర్స్ ఒప్పందం స్వతంత్రం తర్వాత జరిగిన అతిపెద్ద కుంభకోణంగా ప్రచారం జరుగుతుంది.

ప్రపంచ న్యాయ చరిత్రలో ఎక్కడా లేని విధంగా దాని కొనుగోలు ధరను ఏ విధంగా నిర్ణయించారనే దానిపై ప్రభుత్వం సీల్డ్ కవర్ లో ఇచ్చిన సమాచారాన్ని తెరిచి కూడా చూడకుండా, దాని ఆధారంగా ప్రభుత్వంకు సుప్రీం కోర్టు క్లాన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత పదవి విరమణ జరగగానే ప్రధాన న్యాయమూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు.

ఆ తర్వాత నోట్ల రద్దు అంశం కూడా ఇంకా వివాదాస్పదంగానే కొనసాగుతుంది. పారదర్శకమైన విచారణకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఇప్పుడు తాజాగా అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కుదుర్చుకున్న రక్షణ ఒప్పందంపై అనేక ఆరోపణలు తలెత్తుతున్నాయి.

అమెరికా పర్యటనలో విందులు, ప్రముఖులను ప్రధాని కలవడం గురించి ప్రచారం చేసుకోవడమే గాని కుదుర్చుకున్న కీలక రక్షణ ఒప్పందం గురించిన వివరాలు వెల్లడించక పోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో భాగంగా అమెరికాకు చెందిన రక్షణరంగ ఉత్పత్తుల సంస్థ జనరల్‌ అటామిక్స్‌ (జీఏ) అనే ప్రైవేటు కంపెనీతో భారత్‌ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది.

ఈ ఒప్పందం ప్రకారం ఎంక్యూ9బీ రకానికి చెందిన 31 ప్రిడేటర్‌ డ్రోన్లను జీఏ భారత్‌కు సరఫరా చేస్తుంది. ఇందుకోసం 3.072 బిలియన్‌ డాలర్లు (రూ. 25,200 కోట్లు) జీఏకు భారత్‌ చెల్లించను న్నది. అమెరికాతో ఉన్న దౌత్య సంబంధాల్లో భాగంగా ఈ డీల్‌ కుదుర్చుకొన్నట్టు, రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంగా ఈ డీల్‌ను అభివర్ణించారు.

భారత్‌ కొనుగోలు చేయనున్న 31 డ్రోన్‌ విమానాల్లో సముద్రాలపై నిఘా కోసం 15 నేవీకి, గగనతలం నుంచి భూతలంపై నిఘా కోసం 16 ఆర్మీకి అందించనున్నారు.అంతవరకు బాగానే ఉంది. దానికి చెల్లిస్తున్న ధర వివాదాస్పదంగా మారింది. జీఏ సరఫరా చేయనున్న 31 ప్రిడేటర్‌ డ్రోన్లకు భారత్‌ రూ. 25,200 కోట్లను చెల్లించనుంది.

అంటే ఒక్కో డ్రోన్‌ విలువ రూ. 813 కోట్లు. అంతర్జాతీయ విపణిలో ఇదే మాడల్‌ ప్రిడేటర్‌ డ్రోన్‌ ఖరీదు రూ. 150 కోట్లు మాత్రమే ఉన్నది.  2016లో కేవలం రూ. 102 కోట్లకే ఒక్కో డ్రోన్‌ను అమ్మేందుకు బ్రిటన్‌తో ఈ కంపెనీ డీల్‌ కుదుర్చుకొన్నది. జర్మనీకి కూడా రూ. 139 కోట్లకు అమ్మడానికి సిద్ధమైంది. అయితే ఆస్ట్రేలియాకు మాత్రం రూ.1,066 కోట్లను కోట్‌ చేసింది. ధర ఆమోదయోగ్యంగా లేదన్న కారణంతో ఆస్ట్రేలియా ఈ డీల్‌ నుంచి తప్పుకొన్నది.

అంటే ఒక్కో డ్రోన్‌ కోసం భారత్‌ నాలుగైదు రెట్లు ఎక్కువ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధమైనట్టు తెలుస్తున్నది. దీనిపై సర్వత్రా విమర్శలు చెలరేగడంతో కేంద్రం నష్టనివారణ చర్యలకు పూనుకొన్నది. ఇంకా డీల్‌ పూర్తిస్థాయిలో ఫైనల్‌ కాలేదని, రేటు గురించి మాట్లాడాల్సి ఉన్నదని యూటర్న్‌ తీసుకొన్నది. అయితే, డీల్‌ ఇప్పటికే పూర్తయినట్టు రాయిటర్స్‌ సహా ప్రధాన పత్రికలు ప్రచురించడం గమనార్హం.

రాజకీయ ఒత్తిడిల కారణంగానే ఈ ఒప్పందం జరిగిన్నట్లు స్పష్టం అవుతుంది. కేవలం ఈ ఒప్పందం కోసమే మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు ప్రధాని మోదీని అధికారిక పర్యటనకు ఆహ్వానించి, గతంలో మాదిరిగా భారత్ లో మైనారిటీలపై సహనం, మీడియాపై దాడులు వంటి అంశాలు ప్రస్తావించబోమని హామీ ఇచ్చారని తెలుస్తున్నది.

మోదీ పర్యటనకు కొద్దీ రోజుల ముందే అమెరికా విదేశాంగ కార్యదర్శి, రక్షణ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారుడు భారత్ లో పర్యటించి ఈ ఒప్పందంకు సంబంధించి అన్ని అంశాలను ఖరారు చేసుకున్నారు. కానీ భారత్ ఎటువంటి కసరత్తు చేయలేదు.

అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ, డెమోక్రటిక్‌ పార్టీలతో ఎనర్జీ సెక్టార్‌లో వేళ్లూనుకొన్న జీఏకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే, జీఏ నుంచి ప్రిడేటర్‌ డ్రోన్లను కొనుగోలు చేయాలంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ గతంలో భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్న బైడెన్‌ ప్రభుత్వం కూడా జీఏ పక్షాన భారత్‌పై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తున్నది.

తమకు ఇప్పటికిప్పుడు 31 ప్రిడేటర్‌ డ్రోన్లు అవసరం లేదని, 18 డ్రోన్లను కొనుగోలు చేయాలని ఆర్మీ గత ఏప్రిల్‌లో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అమెరికా నుంచి డ్రోన్ల కొనుగోలుపై పునరాలోచించాలని కూడా గతంలో ఓసారి సూచించింది. పైగా, సాంకేతిక మార్పిడి అంశం లేకుండా ఈ కొనుగోలు జరపడం భారత్ భద్రతకు ప్రమాదకరమని నిపుణులు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles