అమిత్ షా రాక ముందు బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు

Sunday, December 22, 2024

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తమిళనాడులో ఓ బహిరంగసభలో ప్రసంగించి, అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు కురిపించి వచ్చారో లేదో – ఆ మరుసటి రోజే రాష్త్ర మంత్రి సెంథిల్ బాలాజీ ఇల్లు, సచివాలయంలోని కార్యాలయం, సన్నిహితుల ఇళ్లపై ఈడీ దాడులు జరపడం, బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేయడం జరిగింది.

ఇక, అమిత్ షా బుధవారం రాత్రికి హైదరాబాద్ చేరుకోవడానికి ముందే తెల్లవారుజాము నుండే పలువురు బిఆర్ఎస్ నేతల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ దాడులు ప్రారంభించింది. వారిలో ఇద్దరు ఎమ్యెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. గతేడాది భారీస్థాయిలో ఈడీ, ఐటీ సోదాలు జరగగా, ప్రధానంగా బీఆర్ఎస్ కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు విచారణకు కూడా హాజరు కావాల్సి వచ్చింది.

ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇళ్లలో, కార్యాలయాలలో బుధవారం ఉదయం నుండే ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ఏకంగా 70 ప్రత్యేక బృందాలు ఈ సోదాలను జరుపుతున్నట్టు తెలుస్తుండడంతో బిఆర్ఎస్ వర్గాలలో ఆందోళన కలుగుతుంది.

భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కంపెనీల్లో ఈరోజు ఉదయం నుంచి ఏకకాలంలో ఐటీ సోదాలు చేపట్టింది. భువనగిరి, హైదరాబాద్‌ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలానీలోని కార్యాలయాల్లో మొత్తం 12 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై ఐటీ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 15కు పైగా కంపెనీల్లో ఎమ్మెల్యే పెట్టుబడులు పెట్టినట్లు ఆదాయపుపన్ను శాఖ భావిస్తుండగా… ఈ నేపథ్యంలోనే ఈ రైడ్స్ జరుగుతున్నట్లు సమాచారం.
హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌ కంపెనీలకు పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టర్‌గా ఉన్నారు.

ఇటు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్‌పై కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. కేపీహెచ్‌బీ కాలనీలోని జేసీ బ్రదర్స్‌లో ఐటీశాఖ తనిఖీలు చేపట్టింది. ఈరోజు ఉదయం 6 గంటల నుండి సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు, తెలంగాణాలో పలు పట్టణాలలో క్లోత్ షోరూమ్ లున్న జేసీ బ్రదర్స్‌కు సంబంధించి ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, అతని బంధువులు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. జేసీ బ్రదర్స్‌లో జరిగిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌ వద్ద ఉన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో కూడా అధికారుల సోదాలు చేపట్టారు. కొండాపూర్‌లోని లుంబిని ఎస్‌ఎల్‌ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్‌లో ఎంపీ ఉండే ఇంటితో పాటు కార్యాలయాలపైన ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సెంట్రల్ ఫోర్స్ బందోబస్తు మధ్య ఈ సోదల ప్రక్రియ కొనసాగుతోంది.

గతంలో బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలపై ఐటీ సోదాలు సంచలనం సృష్టించింది. మంత్రి మల్లారెడ్డిపై సుదీర్ఘంగా మూడు రోజులపాటు తనిఖీలు చేపట్టారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలతో పాటు ఆయన కుమారుడు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. ఫలింతగా ఆయన ఐటీ విచారణకు హాజరయ్యారు. ఇక మరో మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కంపెనీల్లో కూడా ఈ సోదాలు జరగటమే కాకుండా ఢిల్లీకి వెళ్లి విచారణకు హాజరయ్యారు.

ఇక సీఎం కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో రావడం, ఆమెను సీబీఐ ఒక సారి, ఈడీ రెండు సార్లు విచారణకు పిలవడం జరిగింది. మరో కొద్దీ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో ఈ సోదాలు రాజకీయ కలకలం రేపుతున్నాయి. ఇవి ఇంతటితో ఆగుతాయా? ఈ జాబితాలో మరికొంతమంది కూడా చేరతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles