బీజేపీ అగ్రనేతలు జెపి నడ్డా, అమిత్ షా వరుసగా రెండు రోజులలో, రెండు మూలాల నుండి ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై `అత్యంత అవినీతి ప్రభుత్వం’ అంటూ విమర్శలు కురిపించడంతో వైసిపి నేతలకన్నా కొందరు బీజేపీ నేతలు ఎక్కువగా బాధపడ్డారని మాట వినిపిస్తున్నది.
బీజేపీలో వైసిపి కోవర్టులుగా పేరొందిన నేతలు, ఢిల్లీలో ఏపీ మంత్రులు, ఇతర వైసిపి నేతలు ఎవ్వరు వెళ్లినా వారికి కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులతో కలిసే ఏర్పాట్లు చేస్తున్న నేతలు ఈ విమర్శలను విని తట్టుకోలేక పోయిన్నట్లు కనిపిస్తున్నది.
ముఖ్యంగా విశాఖపట్నం బహిరంగసభలో అమిత్ షా హిందీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువాదం చేసిన రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు జగన్ ప్రభుత్వంపై అంతగా ఘాటుగా చేసిన విమర్శలను తెలుగులో అంతే ఉధృతంగా వినిపించేందుకు వెనుకడుగు వచ్చినట్లు స్పష్టం అవుతుంది. అందుకనే అమిత్ షా ఆద్యంతం ఆగ్రహంతో, ఆవేశంతో ప్రసంగిస్తే దానిని తెలుగులోకి తర్జుమా చేసిన జివిఎల్ కామెడీగా మార్చేశారనే విమర్శలు చెలరేగుతున్నాయి.
అమిత్ షా క్లుప్తంగా, సరళమైన హిందీలో చేసిన ప్రసంగం తెలుగు వారికి కూడా అర్థమయ్యే విధంగా ఉంది. అమిత్ షా జగన్ ప్రభుత్వంపై నిప్పుల వర్షం కురిపిస్తుంటే తెలుగు అనువాదంలో జీవీఎల్ తత్తరపాటుకు గురవడం అందరికి స్పష్టంగా కనిపించింది. ఆ మాటల తీవ్రతను తెలుగులో తగ్గించి చెప్పే ప్రయత్నం చేశారు.
దానితో అమిత్ షాకు అనుమానం వచ్చింది. అసహనం వ్యక్తం చేశారు. తాను ఒకటి చెబుతుంటే, మరొకరు అనువాదం చేస్తున్నట్లు గ్రహించారు. “నేనే చెప్పను .. మీరేమి చెబుతున్నారు” అంటూ అడిగేసారు. పదేపదే అర్థం కానట్టు బ్లాంక్‌గా చూస్తుండటంతో దగ్గరకు వచ్చి తన ప్రసంగం స్పష్టంగా వినమని కోరారు.
తన మాటలు అర్థం కావడం లేదనుకొని తిరిగి అవే మాటలను చెప్పడం చేశారు. హిందీలో చెబుతున్న అంకెలు అర్థం కావడం లేదని ఇంగ్లీష్ లో కూడా అమిత్ షా చెప్పారు. జివిఎల్ ఇబ్బందులను గమనించే తనకు అనువాదం చేస్తానని మాజీ ఎమ్యెల్సీ పివిఎన్ మాధవ్ ముందుకు వచ్చారు. దానితో ఖంగారుగా జివిఎల్ విముఖత చూపారు.
అయితే, సీఎం జగన్ పట్ల `ప్రభు భక్తి’తో వ్యవహరించే నేతగా పేరుండడంతో ఆయన చేస్తున్న విమర్శలను అంతే ఉధృతంగా తెలుగులో చెప్పేందుకు తత్తరపాటుకు గురయినట్లు కనిపిస్తుంది. ఇదంతా చూసి సభలోని జనం గోల చేయడం ప్రారంభించారు. ఈ గందరగోళానికి అమిత్ షా అనుకున్న సమయంకన్నా ముందే అర్థాంతరంగా ముగించిన్నట్లు అర్థం అవుతుంది.
వచ్చే ఎన్నికలలో విశాఖపట్నం నుండి లోక్ సభకు పోటీ చేయాలని సంబరపడుతున్న జివిఎల్ నరసింహారావు ఈ సభలో తాను అల్లరిపాలు కావడమే కాకుండా, మొత్తం సభ వాతావరణాన్ని పరిహాసంగా మార్చారు.