అమిత్ షా, చంద్రబాబు … ఎవ్వరి రాజకీయ ఎత్తులు వారివేనా!

Tuesday, November 5, 2024

2018లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత టీడీపీ అధ్యక్షుడు మొదటిసారిగా గత శనివారం రాత్రి కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా ను కలవడం, ఆ సమయంలో బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా అక్కడే ఉండడంతో వారి వచ్చే ఎన్నికలలో పొత్తుల కోసమే కలిసారని కధనాలు విస్తృతంగా వ్యాపించాయి.

మరుసటి రోజే, సోషల్ మీడియాలో అయితే రెండు పార్టీల పొత్తు కూడా ఖరారు అయిందంటూ ఏపీలో బీజేపీ పోటీ చేయబోయే లోక్ సభ, అసెంబ్లీ స్థానాల జాబితా అభ్యర్థుల పేర్లతో సహా ప్రచారమయ్యాయి. అయితే ఈ భేటీ జరిగి మూడు రోజులు అవుతున్నా అటు బీజేపీ నుండి గాని, ఇటు టిడిపి నుండి గాని ఎటువంటి సంకేతాలు అధికారికంగా వెలువడటం లేదు.

పైగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి అయితే ఆయా భేటీకి, ఎన్నికల పొత్తుకు సంబంధం లేదని, తెలంగాణాలో బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుందని స్పష్టం చేశారు.  నిజంగా పొత్తుల గురించి ప్రాధమిక స్థాయిలో చర్చలు జరిగినా పార్టీ శ్రేణులలో, ప్రజలలో స్పందనను తెలుసుకొనేందుకు రెండు పార్టీల నేతలు కొన్ని సంకేతాలు వదిలేవారు.

దానితో, వారి భేటీలో పొత్తుల గురించిన ప్రస్తావన రాలేదని భావించవలసి వస్తుంది. అయితే, గత ఐదేళ్లుగా రెండు పార్టీల మధ్య నెలకొన్న ఒక రకమైన `విద్వేష’ సంబంధాన్ని పక్కన పెట్టి, భవిష్యత్ అవసరాలకోసం `సామరస్య’ బంధాన్ని కొనసాగించే ఎత్తుగడలో భాగంగా ఈ భేటీ జరిగిన్నట్లు కనిపిస్తున్నది.

ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా ఎన్డీయేలో భాగస్వామి కాకపోయినప్పటికీ కేంద్రంలో అన్ని విషయాలలో బిజెపికి బాసటగా నిలబడుతున్నారు. బిజెపి సహితం జగన్ ను కష్టాలలో అన్ని విధాలుగా ఆదుకొంటూ వస్తున్నది.  ఏపీలో వైసిపి- టీడీపీ రాజకీయంగా వైరుధ్యం గల పార్టీలైనా, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం విషయంలో మాత్రం ఒకేవిధంగా సహకారం అందిస్తున్నాయి.

వైఎస్ జగన్ ప్రభుత్వం తనతో పాటు టిడిపి సీనియర్ నేతలను పలు పొలిసు కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తుండటం, ఎన్నికల సమయంలో దౌర్జన్యాలకు దిగడం ద్వారా భీభత్సకర పరిస్థితులు సృష్టించే అవకాశం ఉండడంతో ఆపదలు ఎదురైతే కేంద్రం `మాట సహాయం’ చేసేవిధంగా చేసుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు కేంద్ర నాయకులతో సంబంధాలను మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబుకు వ్యక్తిగతంగా బిజెపితో పొత్తు పెట్టుకొని, వైసీపీకి దూరంగా నెట్టాలని ఉన్నప్పటికీ అందుకు బిజెపి సిద్ధంగా లేదు. అంతేకాదు, టిడిపిలో సహితం మొత్తం మీద వ్యతిరేకత ఎదురవుతోంది. తెలంగాణ వరకు టీడీపీ సహకారం బిజెపి కోరుతున్నప్పటికీ ఏపీ సంగతి తేల్చకుండా ఇక్కడ ఇచ్చేందుకు సిద్ధంగా లేదు.

ముఖ్యంగా టిడిపి శ్రేణులలో జగన్ కు అండగా ఉంటున్న బిజెపి పట్ల ఒక రకమైన విద్వేష భావం రగలడంతో రెండు పార్టీలు పొత్తుకు సిద్ధమైనా ఓట్ల బదిలీ ఏమేరకు ఉంటుందన్నది సందేహాస్పదం కాగలదు. 2024 ఎన్నికల అనంతరం ఈ రెండు పార్టీలకు చెందిన యంపీలు కేంద్రంలో తమకు మద్దతుగా అంటారన్న భరోసాగా బిజెపి నేతలలో ఉంది. ఒకవేళ వైసిపి బలం తగ్గినా టిడిపి దూరంగా జరిగే అవకాశం ఇవ్వకుండా చేసేందుకు చంద్రబాబుతో అమిత్ షా భేటీ జరిపినట్లు స్పష్టం అవుతుంది.

ఈ భేటీ జరపడంతో ఎవ్వరి ఎత్తుగడలు వారివి. 2018 నాటి అనుభవం తర్వాత ఒకరిపై మరొకరికి నమ్మకం కలిగే అవకాశం లేదు. కేవలం రాజకీయ అవసరాలే వారిని దగ్గరకు చేరుస్తున్నాయి. అయితే వైఎస్ జగన్ ను వదులుకొని చంద్రబాబుకు దగ్గరయ్యే అంతటి అవసరం ప్రస్తుతం బిజెపికి లేదు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకనే వ్యూహాత్మకంగా పరస్పరం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles