అమిత్ షా – కేటీఆర్ భేటీకి ఈటెల అడ్డుకట్ట!

Wednesday, January 22, 2025

తెలంగాణ రాజకీయాలలో కలకలంకు దారితీసిన శనివారం రాత్రి జరగవలసిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ  అనూహ్యంగా రద్దయింది. అందుకు ప్రధాన కారణం అంతకు ముందే అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డలతో సమావేశమైన తెలంగాణ బీజేపీకి నాయకులు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అడ్డుకట్ట వేయడమే కారణంగా కనిపిస్తోంది.

కొద్దీ కాలంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్న కేటీఆర్ చాలాకాలం తర్వాత ఢిల్లీ ప్రయాణమై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కావడం సంచలనం కలిగించింది. మరో ఐదు నెలల్లో తెలంగాణ ఎన్నికలు జరుగనున్న సమయంలో తెలంగాణాలో కాంగ్రెస్ పుంజుకోవడంతో ఖంగారుతో కాంగ్రెస్ ను కట్టడి చేయడం కోసం బిజెపి సహాయం కోసం కేటీఆర్ ఈ భేటీలు జరుపుతున్నారని ప్రచారం జరిగింది.

కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణాలో బిజెపి గ్రాఫ్ పడిపోతుండటంతో అందుకు బిజెపి నాయకత్వం వైఖరియే కారణమని అసంతృప్తితో కొద్దీ రోజులుగా మౌనంగా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈటెల, కోమటిరెడ్డిలను శనివారం ఢిల్లీ పిలిపించారు. వారితో పాటు తెలంగాణ నుండి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని కూడా అర్థాంతరంగా పిలిపించారు.

బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో అమిత్ షా, జెపి నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా `బిఆర్ఎస్ – బిజెపి’ల మధ్య రహస్య అవగాహన ఉండనే ప్రచారం జరుగుతోందని, అందుకు బిజెపి నాయకుల ధోరణి కూడా కారణం అవుతున్నదని ఆ ఇద్దరు నాయకులు స్పష్టంగా చెప్పడంతో బీజేపీ అగ్రనేతలు ఖంగు ఉన్నట్లు తెలిసింది.

తమకు వచ్చి కలవమని పిలిచి, అదే సమయంలో కేటీఆర్ తో అమిత్ షా భేటీ కావడం తెలంగాణ ప్రజలకు ఎటువంటి సందేశం పంపుతుంది? అంటూ వారు నిలదీశారు. దానితో ఆత్మరక్షణలో పడిన అమిత్ షా వెంటనే రాత్రి 10.10 గంటల ప్రాంతంలో తన ఇంట్లో కేటీఆర్ ను కలవాల్సి ఉండగా, ఆ భేటీని రద్దు చేసుకున్నారు. ఈటెల, కోమటిరెడ్డిలతో భేటీ పూర్తయిన తర్వాత కూడా అమిత్ షా చాలాసేపు బిజెపి కార్యాలయంలోనే గడిపినట్లు చెబుతున్నారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు బీజేపీ బలంగా కృషి చేస్తుందన్న స్పష్టమైన సంకేతాలను ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని, లేదంటే తెలంగాణ ఎన్నికలలో బిజెపి ఘోరంగా పరాజయాన్ని మూటగట్టు కొంటుందని వారిద్దరూ స్పష్టం చేశారని తెలుస్తున్నది. ఓవైపు తమను ఢిల్లీకి పిలిచి, తమతో మాట్లాడుతూనే.. కేసీఆర్‌ కుమారుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడమేంటని వారు ప్రశ్నించారు. దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని తేల్చి చెప్పారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎ్‌సతో బీజేపీ కుమ్మక్కయినట్లు వార్తలు వస్తున్నాయని,  అలాంటిదేమీ లేదన్న విషయాన్ని బలమైన నిర్ణయాల ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని సుమారు గంట సేపు జరిగిన భేటీలో వారు నిర్మొహమాటంగా చెప్పారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత విషయంలో ఈడీ, సీబీఐ మెతక వైఖరి అవలంబించాయని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

కాంగ్రెస్ లో చేరమని తమపై వత్తిడులు వస్తున్నాయని పేర్కొంటూ, వేగంగా నిర్ణయాలు తీసుకుంటేనే తాము పార్టీలో ఉంటామని వారు పరోక్షంగా సంకేతం ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఢిల్లీ మద్యం కుంభకోణంతో పాటు కేసీఆర్‌ అవినీతిపై కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పార్టీ చిత్తశుద్ధి పట్ల ప్రజల్లో అనుమానాలు పెరిగాయని వారు చెప్పినట్లు తెలిసింది.

అయితే తమ అభిప్రాయాలను బీజేపీ అగ్రనేతలు వినడమే గాని ఎటువంటి సమాధానం ఇవ్వలేదని, కనీసం వారికి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదని తెలుస్తోంది.  కనీసం రాబోయే రోజులలో నిర్దుష్టంగా కొన్ని చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇవ్వకపోవడంతో ఈటెల, కోమటిరెడ్డి సహితం అసంతృప్తిగానే ఉన్నట్లు స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles