అమరావతి రైతులకు హైకోర్టులో చుక్కెదురు

Saturday, January 18, 2025

అమరావతి రైతులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆర్-5 జోన్‌ పై దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఇళ్ల పట్టాల పంపిణీపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని సూచించింది. దీంతో అమరావతి రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాస్టర్ ప్లాన్ మార్చిందని రైతుల ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టులో తీర్పు ఇస్తూ అది చట్ట విరుద్ధమని ప్రకటించింది. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసిందని, రాజధాని అవసరాల కోసమే తాము ఇచ్చిన భూముల్ని ఇతరులకు పంచుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఆర్‌-5జోన్ ఏర్పాటు, ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను నిలిపివేయాలని అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం కోర్టు విచారించింది. ఆర్ -5 జోన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు సీజే ధర్మాసనం నిరాకరించింది. అయితే ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు ఆదేశాలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది.

ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని పిటిషన్‌ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఏ ఒక్కరికో ఒక వర్గానికి పరిమితం కాదని సీజే పేర్కొన్నారు. ”రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే .పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్‌ కాదు” అని చెప్పారు.

“రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవే. భూములు వారివి కావు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారు. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేం నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం విధుల్లో భాగం” అని సీజే పేర్కొన్నారు

సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేయాలని రైతులు కోరారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ఆర్‌- 5జోన్‌గా మార్చి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 1134 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. ఈ అంశంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తిరస్కరించడంతో రైతులు శనివారం సుప్రీంకోర్టు తలుపుతట్టనున్నారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేయాలని రైతులు భావిస్తున్నారు.

అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జోన్‌(ఆర్-5) ఏర్పాటు చేసింది. ఇందుకోసం సీఆర్‌డీఏ చట్ట సవరణ చేసింది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో 1134 ఎకరాల మేర పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ఆర్‌-5 జోన్‌ పేరిట గెజిట్​నోటిఫికేషన్ జారీచేసింది.

ఆర్‌-5 జోన్‌పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించటానికి 15 రోజుల గడువు ఇచ్చింది. అయితే తమ భూములను రాజధాని కోసమే ఇచ్చామని ఆ ప్రాంత రైతులు హైకోర్టుకు వెళ్లారు. రైతుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి మార్గం సుగమం అయింది. అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles