ప్రపంచం మన తెలుగునేలవైపు తలతిప్పి చూసేలా అద్భుత రాజధానిని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబునాయుడు స్వప్నం సాకారం కావడంలో అడుగులు వడివడిగా పడుతున్నాయి. అమరావతి నిర్మాణంలో ఇప్పటికే అనేక పనులకు సంబంధించి టెండర్లు పూర్తయిన సంగతి తెలిసిందే. అలాగే కీలక, ఐకానిక్ భవనాలకు టెండర్లు పిలవనున్నారు. కానీ.. అమరావతి మహాగనర నిర్మాణం అనేది కేవలం ఈ భవనాలు మాత్రమే కాదు.. ఇంకా వందల వేల అపురూప భవనాలు టౌన్ షిప్ లు యుటిలిటీ వ్యవహారాలు అనేకం ఇందులో మిళితమై ఉంటాయి. వీటన్నింటినీ.. సక్రమంగా సకాలంలో పూర్తిచేసేందుకు సీఆర్డీయే కొత్త ఆలోచనలు చేస్తోంది. రాజధాని నిర్మాణంలో భాగం పంచుకోవడానికి అంతర్జాతీయంగా పేరెన్నికగతన్న కాంట్రాక్టు నిర్మాణ సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానిస్తోంది.
రాష్ట్రంలో పనులు చేపట్టే సంస్థ ఇక్కడ రిజిస్టరు అయి ఉండాలి. అయితే అమరావతి నిర్మాణాల కోసం కొత్తగా సీఆర్డీయే ఆహ్వానిస్తున్న అంతర్జాతీయ సంస్థలకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం సింగిల్ డెస్క్ విధానంలో పూర్తయ్యేలాగా సీఆర్డీయే ఏర్పాట్లు చేస్తున్నది.
అదే సమయంలో అమరావతిలో ఒక మహాయజ్ఞంలాగా జరగబోయే నిర్మాణ పనులకు అవసరమయ్యే నిపుణులైన కూలీల అవసరం కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటుంది. దానికి తగినట్టుగా స్థానికంగా ఉన్న వారికి నిర్మాణ రంగంలోని పనుల్లో ప్రవేశం ఉన్న వారికి మరింత మెరుగైన శిక్షణలు ఇవ్వడం ద్వారా వారినందరినీ అమరావతి నిర్మాణంలో భాగస్వాముల్ని చేయడానికి సీఆర్డీయే ప్రయత్నిస్తోంది. వేలాది మందికి నిర్మాణ రంగ పనుల్లో కొత్తగా శిక్షణలు ఇవ్వబోతున్నారు. వీరందరికీ రాబోయే కొన్ని ఏళ్లపాటూ ఇక్కడే పని కల్పించబోతున్నారు. నిజం చెప్పాలంటే అమరావతి ప్రాంతంలో రాబోయే అయిదేళ్లలో పనులు జరగబోయే ఒరవడికి లక్షల సంఖ్యలో మానవ వనరులు అవసరమైనా ఆశ్చర్యం లేదు. దానికి తగ్గట్టుగా స్థానికంగా రాష్ట్రానికే చెందిన నిర్మాణ రంగ కూలీలనే సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తుండడం విశేషం.
సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఇక్కడకు వచ్చి నిర్మాణ రంగంలో పనిచేస్తుంటారు. వారికి తోడుగా.. మన రాష్ట్ర వనరుల్ని కూడా వాడుకునేలా ప్లాన్ చేస్తున్నారు. దానికి తోడు అంతర్జాతీయ కాంట్రాక్టు సంస్థలను కూడా రంగంలోకి దించుతుండడంతో.. పనులు పెద్దసంఖ్యలో వేగంగా జరిగే అవకాశం ఉంది.
అమరావతి మహాయజ్ఞం కోసం కొత్త ఆలోచనలతో!
Thursday, December 19, 2024