ప్రపంచం మొత్తం మనవైపు తల తిప్పి చూసే అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానని నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకునే దిశగానే ఇంచుమించు 55 వేల ఎకరాలలో అమరావతి నగర నిర్మాణానికి రూపకల్పన చేశారు. భవిష్యత్తు తరంలో నగరాలు ఎలా ఉంటాయో ఒక ప్రతీకగా నిలిచేలా, అద్భుతమైన రూపా నిర్మాణ శైలులతో, హరిత నీలి నగరంగా అమరావతిని రూపుదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. నగర నిర్మాణం మొదలైంది. కొన్ని నిర్మాణాలు ఇంచుమించుగా పూర్తయ్యే దశకు వచ్చాయి. కొన్ని అద్భుతాలు శ్రీకారం దిద్దుకున్నాయి. మౌలిక వసతుల పరంగా పనులు చురుగ్గా సాగుతూ ఉండే సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అమరావతికి గ్రహణం పట్టింది. కొత్త ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమరావతి అనే ఆలోచననే చిదిమేసే ప్రయత్నం చేశారు. అయితే ఒక అద్భుత రాజధాని కోసం తమ పొలాలను త్యాగం చేసిన రైతుల విన్నపాలు ఆలకించిన న్యాయస్థానం అమరావతిని అభివృద్ధి చేసి తీరాల్సిందే అని ఆదేశాలు ఇచ్చింది.
ఇలాంటి నేపథ్యంలో అమరావతి నగరానికి ఒక కంట కన్నీరు మరో కంట పన్నీరు.. కారగల పరిస్థితి తాజాగా ఎదురైంది. ఒక కంట పన్నీరు ఎందుకంటే.. ఆర్కిటెక్చర్ విషయాలలో ప్రపంచ స్థాయిలో ఎంతో పేరెన్నిక గన్న, వివిధ ఖండాలలో కూడా విస్తరించి ఉన్న మేగజైన్న్ ఇంకా పూర్తికాని అమరావతి నగరాన్ని.. ప్రపంచంలోనే అత్యుత్తమ భవిష్య నగరాల జాబితాలో అగ్రశ్రేణిలో పేర్కొనడం!
ప్రపంచంలోని ఆర్కిటెక్చర్ సంగతులను ప్రత్యేకంగా తెలియజేస్తే ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ అనే పత్రిక న్యూయార్క్ కేంద్రంగా గత 103 సంవత్సరాలుగా నడుస్తుంది. ఈ పత్రిక తాజాగా ప్రపంచంలో భవిష్య నగరాలుగా ముద్ర పడగల ఆరు నగరాల గురించి విశేషాలు అందించింది. రాబోయే 50 ఏళ్లలో ప్రపంచం ఏ విధంగా ఉండబోతున్నది తెలుసుకోవడానికి ఈ నగరాలు నిదర్శనంగా నిలుస్తాయని కూడా పేర్కొంది.
మెక్సికోలోని స్మార్ట్ ఫారెస్ట్ సిటీ, అమెరికాలోని టెలోసా, చైనాలోని చెంగ్డు స్కై వ్యాలీ, డక్షిణ కొరియాలోని ఓషియానిక్స్ బూసన్, సౌదీ అరేబియాలోని ద లైన్ నగరాలతో పాటూ భవిష్య నగర జీవిత సాంకేతికకు నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిని కూడా పేర్కొంటూ ఈ మేగజైన్ కథనాల్ని వెలువరించడం విశేషం.
అయితే అమరావతి నగరానికి రెండో కంట కన్నీరు ఎందుకంటే.. జగన్ సర్కారు మొత్తం ఈ నగర విధ్వంసానికి కంకణం కట్టుకుని పగబట్టినట్టుగా ప్రవర్తిస్తుండడం. హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశించిన తర్వాత కూడా.. అమరావతి ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. కనీసం 80-90% పూర్తయిన నిర్మాణాలైనా కంప్లీట్ చేస్తే బాగుంటుందని కూడా వారు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు సంకల్పించిన నగరం గనుక దానిని సర్వ నాశనం చేయడం ఒక్కటే తమ ఎజెండా అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో అమరావతికి అంతర్జాతీయ అద్భుత భవిష్య నగరాల జాబితాలో చోటు దొరికినందుకు సంతోషించాలో.. ఆ నగరం పూర్తవుతుందో లేదో తెలియని డైలమాలో పడేసి విధ్వంసం దిశగా నడిపిస్తున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చింతించాలో అర్థం కాని స్థితిలో ప్రజలు ఉన్నారు.