అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజధాని అమరావతి పట్ల ఒక విధంగా కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా అక్కడ ఇతర ప్రాంతాలలోని పేదలకు ఇళ్లస్థలాలు పంపిణి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ విషయమై హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించిన ఆ ప్రాంత రైతులకు ఉపశమనం లభించలేదు.
అయితే ఈ విషయమై ఏపీ హైకోర్టు ఇచ్చి తుది తీర్పుకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా, హడావుడిగా పట్టాలు పంపిణి చేస్తూ, గృహనిర్మాణంకు కూడా పావులు కదుపుతూ ఉండడం గమనిస్తే భవిష్యత్లో కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చినా అమలు సాధ్యంకాని పరిస్థితులు ఏర్పరచే ప్రయత్నంగా కనిపిస్తుంది.
రాజధానిలో ఇళ్ల స్థలాల కోసం నిర్దేశించిన ఆర్ 3 జోను ఉండగా పారిశ్రామిక అభివృధ్ధికోసం నిర్దేశించిన ఆర్ 5 జోనులో సిఆర్డిఎ చట్టంలో సవరణ తీసుకు వచ్చి మరీ ఇళ్ల స్థలాలనడంలో మర్మం రాజధాని సంకల్పానికి శాశ్వతంగా సమాధి వేయాలనే ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు.
ఇళ్లస్థలాలకోసం ఉద్దేశించిన ఆర్ 3 జోన్ ను అభివృద్ధి చేసి, ముందుగా అమరావతి పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వవలసి ఉండగా అటువంటి ప్రయత్నం చేయడం లేదు. కనీసం గత ప్రభుత్వం అమరావతిలో కట్టిన ఇళ్లను ఇప్పటివరకు ఇవ్వకుండా దాన్ని వదిలేసి పారిశ్రామిక అభివృద్ధికి నిర్దేశించిన ఆర్ 5 జోనులో ఒకొక్కరికి సెంటు ఇవ్వడం వెనుక రాజకీయ కుతంత్రం ఉన్నట్లు స్పష్టం అవుతుంది.
ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులు అంటున్నా ఆచరణలో అమరావతికి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేయడంతో పాటు స్థానికంగా గల పేద ప్రజలను విభజించి, వారిలో వైమాశ్యాలు పెంపొందించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగా పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి అనుకొంటే ప్రభుత్వమే స్థలాలను కొనుగోలు చేసి ఇవ్వొచ్చు.
కానీ రైతులు రాజధానికోసం ఉచితంగా ఇచ్చిన భూములను ధారాదత్తం చేయడం ఏమిటని ఏపీ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షులు నేతి మహేశ్వర రావు ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉద్దేశించిన ప్రణాళికలు అన్నింటిని ఆటకెక్కించి, భవిష్యత్ లో సహితం అక్కడెవరూ నివాసం ఏర్పర్చుకొనే సాహసం చేయకుండా చేయడం కోసమే పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉద్దేశించిన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల జాతర చేపట్టిన్నట్లు వెల్లడవుతుంది.
ఉచితంగా భూములు ఇచ్చిన రైతులుతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం అమరావతి నగర నిర్మాణం జరగాల్సి ఉంది. అందులో మార్పులు చేర్పులు చేయాలి అనుకొంటే రైతుల అంగీకారంతో జరపాల్సి ఉంటుంది. కానీ అదేమిలేకుండా రూపాయ చెల్లించకుండా భూములిచ్చిన రైతుల భూములను ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు ఇతర కార్యక్రమాలకు ఉపయోగించే ప్రయత్నం కారణంగానే రైతులు కన్నెర్ర చేస్తున్నారు.
ఇప్పుడు రైతులు తిరగబడి, భూసేకరణ చట్టం ప్రకారం ప్రస్తుత మార్కెట్ దర ప్రకారం పరిహారం ఇవ్వమంటే ఇచ్చే ఆర్థిక పరిపుష్ఠిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? అమరావతి నగరాన్ని నిర్మించే పరిస్థితి లేదని వైఎస్ జగన్ ఎప్పుడో చేతులెత్తేశారు. కనీసం రైతులకు అప్పచెప్పినా వారే దివ్యమైన రాజధాని నిర్మించి ఇవ్వగలరు.