అమరావతిపై ఇరకాటంలో సీఎం జగన్

Wednesday, January 22, 2025

ప్రజావ్యతిరేకతను లెక్కచేయకుండా, కోర్టు తీర్పులను పట్టించుకోకుండా అమరావతి నుండి రాజధాని కార్యకలాపాలను రెండు నెలల్లో విశాఖపట్నంకు మార్చడం కోసం సన్నద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా మారిన కేంద్ర ప్రభుత్వ వైఖరితో ఇరకాటంలో పడినట్లు కనిపిస్తున్నది. త్వరలో ఈ విషయమై సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్న సమయంలో ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రం అందించినట్లు అయింది.

ఇప్పటివరకు, రాజధాని ఎక్కడో నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అంటూ తాము జోక్యం చేసుకొనే ప్రసక్తి లేదని రాష్ట్ర హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం గతంలో అఫిడవిట్ దాఖలు చేయడంతో కేంద్రం మద్దతుతో విశాఖకు ప్రభుత్వ కార్యకలాపాలు తరలించడంలో ఇబ్బందులు ఉండబోవని జగన్ ధీమాతో ఉన్నారు. అయితే, ఇప్పుడు స్వయంగా కేంద్రమే ఒక వంక పార్లమెంట్ లో, మరోవంక సుప్రీంకోర్టులో రాష్ట్ర విభజన చట్టం మేరకే అమరావతిని రాజధానిగా నిర్ణయించడం జరిగిన్నట్లు స్పష్టం చేసింది.

మూడు రాజధానుల పేరుతో, అమరావతిని మార్చే చట్టం గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపలేదని పేర్కొనడం ద్వారా తన పరిధిలో లేని అంశంపై జగన్ ప్రభుత్వం చట్టం చేసిందనే అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేసిన్నట్లు అయింది. పైగా, ఈ పరిణామాలు ప్రధాన ప్రతిపక్షం టిడిపిలో ఉత్సాహం కలిగిస్తున్నాయి. రాజధాని విషయంలో తమ పార్టీ వైఖరికి సానుకూలత వ్యక్తం అవుతున్నట్లుగా భావిస్తున్నది.

‘‘ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ వేసింది. శివరామకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టులో ప్రస్తావించింది. శివరామకృష్ణ కమిటీ నివేదికను రాష్ట్రానికి పంపామని తెలిపింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని కేంద్రం తెలిపింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము ఆమోదించామని కేంద్రం చెప్పింది. రాజధానిగా అమరావతిని మెజార్టీ ప్రజలు ఆమోదించారు. ఏపీ ప్రభుత్వం తమను సంప్రదించకుండానే 3 రాజధానుల చట్టం తెచ్చిందని.. కేంద్రం అఫిడవిట్‌లో స్పష్టంగా తెలిపింది. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగానే కేంద్రం ఈ విషయాలు చెప్పింది’’అంటూ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

చట్టంలో లేని అధికారాన్ని జగన్ తన చేతుల్లోకి తీసుకున్నారని  చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ చేసే విధ్వంసాలను సరిదిద్దడం.. రాజ్యాంగ సంస్థలకు కూడా కష్టంగా మారిందని ధ్వజమెత్తారు. చట్టానికి వ్యతిరేకంగా జగన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ఏర్పాటు రహస్యంగా చేసింది కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చర్చలు జరిపామని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారని, అమరావతికి అండగా ఉంటానని ప్రధాని చెప్పారని గుర్తుచేశారు. అమరావతిపై జగన్ మాట మార్చారని దుయ్యబట్టారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తుందేంటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. విభజన చట్టం సెక్షన్ 5లో రాజధానిపై స్పష్టంగా ఉన్నా.. 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

రాజధాని విషయంలో ప్రజల్లో ఇంత గందరగోళం రావడానికి కారణం బీజేపీ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. “గతంలో కేంద్రం ఇచ్చిన అఫిడవిట్‌కు.. తాజాగా ఇచ్చిన అఫిడవిట్‌కు తేడా ఉంది. ఇప్పుడు కాస్త మెరుగ్గా ఉంది. స్వయంగా అమిత్ షా బీజేపీ నేతలను మందలించారు. అమరావతిలో రైతులు ఆందోళన చేస్తుంటే.. ఏం చేస్తున్నారని అమిత్ షా మందలించారు. ఈ విషయంలో వైఎస్సార్సీపీ ఆందోళనకు గురి చేస్తుంటే.. దానికి బీజేపీ వంత పాడింది” అంటూ సిపిఎం నేత గఫార్ విమర్శించారు.

ఇంత జరుగుతున్నా.. ప్రధాని మోదీ ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కాగా, తాజా అఫిడవిట్‌లోనూ పూర్తి స్పష్టత కనిపించడం లేదని పేర్కొంటూ బీజేపీ ఇప్పటికీ తూకం వేసి చూస్తోందని ధ్వజమెత్తారు. అసలు రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదు. కావాలని మధ్యలో వచ్చి గందరగోళం సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని అనుకున్నా తమ విధానం మూడు రాజధానులని స్పష్టం చేశారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles