ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారణాలు ఏవైనా సరే మొదటి నుంచి అమరావతి నగరం పట్ల అసహనం ప్రదర్శిస్తూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆ నగరం అభివృద్ధికి ఏమాత్రం నిధులు ఖర్చు పెట్టకుండా, 90 వరకూ నిర్మాణాలు పూర్తయిన భవనాలను సహితం శిధిలాల మాదిరిగా వదిలి వేస్తున్నారు. రహదారులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్ల ఏమాత్రం శ్రద్ద చూపడం లేదు.
మూడు నగరాల నినాదంతో అమరావతిని ఎడారిగా మార్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం అవుతుంది. తాజాగా, పదిహేనో ఆర్దిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించి, వాటిల్లో ఒక నగరంకోసం ఏపీ నుండి ప్రతిపాదనలు కోరగా కడప జిల్లాలోని కొప్పర్తిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించటం గురించి రాజకీయ దుమారం చెలరేగుతుంది.
అమరావతి అంటే ఇష్టం లేదనుకొంటే, ఎంతో ముచ్చటపడి రాజధానిగా చేస్తున్నామంటున్న ఉత్తరాంధ్రలో అయినా ఏదో ఒక ప్రాంతాన్ని ప్రతిపాదింపవచ్చు గదా అనే ప్రశ్న తలెత్తుతుంది. కేంద్రం నిర్మించాలని భావిస్తున్న నగరాలకు ఒక్కో నగరానికి రూ వెయ్యి కోట్లు చొప్పున ఇవ్వాలని కేంద్రానికి ఆర్దిక సంఘం ప్రతిపాదించింది.
ఈ మేరకు ఎంపిక చేసిన ప్రాంతాల అభివృద్ధికి ప్రతీ ఏటా రూ. 250 కోట్లు కేంద్రం ఇవ్వనుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన సమయంలోనే కొత్త నగరం అభివృద్ధికి కొప్పర్తిని ప్రతిపాదించినట్లు స్పష్టం అవుతోంది.
వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే కడప జిల్లా కొప్పర్తి లో ఎలక్ట్రానిక్ మనుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 540 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్, 3167 ఎకరాల్లో మెగా ఇండస్ట్రీయల్ హబ్ నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండింటిలో మౌలిక వసతులు కల్పన (రోడ్లు, విద్యుత్ సరఫరా), ఫ్యాక్టరీ షెడ్ల నిర్మాణం కోసం అక్షరాల రూ.1580 కోట్లతో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చు చేశారు. ఇక, ఇప్పుడు కేంద్రం కొత్త నగరాల నిర్మాణంలో భాగంగా కొప్పర్తిని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి కేంద్రం ఆమోదముద్ర వేయాల్సి ఉంది.ఇదంతా సీఎం జగన్ వ్యూహాత్మకంగానే చేస్తున్నట్లు వెల్లడి అవుతుంది. అమరావతిని నిర్లక్ష్యం చేసి, ఇతర ప్రాంతాలను నగరాలుగా అభివృద్ధి చేయడంకోసం ప్రతిపాదించడం ద్వారా అమరావతి ప్రాంత ప్రజలకు వారి ఆవేదనలు అరణ్యరోదనగానే మిగులుతాయని సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుంది.
దేశంలో పట్టణ ప్రాంతాలు రద్దీగా మారిన సమయంలో ప్రణాళిక లేకుండా విస్తరిస్తున్నాయని భావిస్తున్న కేంద్రం మౌలిక వసతుల అభివృద్ధి కష్టమవుతోందని పేర్కొంది. ఈ సమయంలో పాత నగరాలను కొత్త రూపునిస్తూ కొత్త నగరాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆర్దిక సంఘం స్పష్టం చేసింది. కొత్తగా నిర్మించే గ్రీన్ ఫీల్డ్ నగరాల్లో రహదారుల నిర్మాణం, తాగు నీరు, మురుగు నీటి పారుదల వంటి వ్యవస్థలకు కావాల్సిన విధంగా అన్నీ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఒక విధంగా ఓ మోడల్ నగరంగా రూపొందే అవకాశం ఉంది.