`అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో ఇతర రాష్ట్రాలకు కేసీఆర్ 

Wednesday, December 18, 2024

టీఆర్ఎస్ ను బిఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయ పార్టీగా ప్రకటించి, ఎన్నికల కమిషన్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే మొదటగా దేశ రాజధాని ఢిల్లీలో హడావుడి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ట్రాలలో అడుగు పెట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీలతో వైరుధ్యం లేకుండా, కేవలం బిజెపి విధానాలకు మాత్రమే పరిమితం అవుతూ `రైతుల ఉద్యమం’గా వ్యాపింప చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 

రైతు సమస్యలపై ప్రధానంగా బిజెపిపై దాడి చేయడం కోసం `అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో బిఆర్ఎస్ ను వివిధ రాష్ట్రాలకు వ్యాపింపచేసే సన్నాహాలు చేస్తున్నారు. అందుకనే మొదటగా జాతీయ స్థాయిలో కిసాన్ సెల్ ను ప్రకటించారు. ఇప్పుడు వివిధ రాష్ట్రాలలో కిసాన్ సెల్ కన్వీనర్ లను మొదటగా నియమించే ప్రయత్నం చేస్తున్నారు. 

వచ్చే ఏడాది మొదట్లో కనీసం ఆరు రాష్ట్రాలలో సొంతంగా పర్యటనలు జరిపి బిఆర్ఎస్ కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. అందుకోసం ఈ నెలాఖరుకల్లా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బిఆర్ఎస్ కిసాన్ సెల్‌లను ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. గత ఏడాది  కాలంగా ప్రగతి భవన్ కు దేశంలోని వివిధ ప్రాంతాలుకు చెందిన రైతు నాయకులను ఆహ్వానించి, పలు మార్లు సమావేశాలు జరపడం తెలిసిందే. 

అదే విధంగా ఢిల్లీలో ఏడాది పాటు జరిగిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం సహాయంగా స్వయంగా వెళ్లి పంజాబ్, బీహార్ వంటి చోట్ల చెక్ లను పంపిణీ చేశారు. మిగిలిన పార్టీలు అన్ని ప్రధానంగా రాజకీయ అంశాలపై బిజెపిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుండగా, తన ప్రభుత్వం అమలు పరుస్తున్న `రైతు బంధు’ ప్రధకంను జాతీయ స్థాయిలో అమలు పరుస్తామంటూ రైతు సమస్యలపై మద్దతు కూడగట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నారు. 

అయితే, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదట్లో మూడు రైతు చట్టాలను తీసుకు వచ్చిన సమయంలో బలమైన మద్దతు అందించిన బిజెపియేతర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే కావడం గమనార్హం. ఆ తర్వాత బిజెపితో విరోధం ఏర్పడడంతో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచారు. 

మరోవంక, వివిధ భారతీయ భాషలకు చెందిన రచయితలు, సాహితీవేత్తలు, పాటల రచయితలతో సహితం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. `తెలంగాణ జాగృతి’ ద్వారా తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ వ్యాప్తంగా సాంస్కృతిక మద్దతు సమీకరించిన కేసీఆర్ కుమార్తె కవిత ఇప్పుడు `భారత్ జాగృతి’ పేరుతో జాతీయ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. 

బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు ప్రకటించినా ఇప్పటి వరకు విధి, విధానాలను కేసీఆర్ ప్రకటించనే లేదు. `తెలంగాణ మోడల్’ను జాతీయ స్థాయిలో అమలు పరుస్తామంటూ ఓ నినాదం ఇవ్వడం మిన్నగా రాజకీయ, ఆర్ధిక, సామజిక విధానాల గురించి ఎటువంటి స్పష్టత లేదు. కనీసం బిఆర్ఎస్ కు సంస్థాగత స్వరూపం కూడా ఏర్పర్చలేదు. 

త్వరలో ఢిల్లీలో జాతీయ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ విధి, విధానాలపై స్పష్టత ఇచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నం చేయగలరని చెబుతున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles