అప్పుల ఊబిలో ఉన్న జగన్ ను కాపాడుతున్న నిర్మలమ్మ!

Saturday, September 7, 2024

అన్ని పరిమితులను అధిగమించి, నిబంధనలకు తిలోదకాలిచ్చి, అక్రమంగా- దొంగచాటుగా దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల లోగుట్టును ఒకవంక ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎండగడుతూ ఉండగా, మరోవంక  వాస్తవాలు ఎక్కడ జనంకు తెలిసిపోతాయి అన్నట్లు జగన్ ను కాపాడే ప్రయత్నం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

ఇదివరకు అనంతపూర్ పర్యటనలో వైఎస్ జగన్ ను ప్రధాని మోదీ `మానస పుత్రుడు’గా అభివర్ణించిన నిర్మలమ్మ పార్లమెంట్ సాక్షిగా ఓ ప్రశ్నకు జవాబిస్తూ జగన్ ప్రభుత్వం ఇస్తున్న గణాంకాలనే వల్లెవేస్తూ వాస్తవాలను దాచే ప్రయత్నం చేశారు. ఏపీ ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాలు అన్ని బాగానే సాగుతున్నాయని అభిప్రాయం కలిగించేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. 2019 మార్చి నెలాఖరు నాటికి ఏపీకి రూ.2,64,451 కోట్ల అప్పు ఉండగా, 2023 మార్చి నెలాఖరు నాటికి అవి రూ.4,42,442 కోట్లకు చేరాయని నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ఓ ప్రశ్నకు సోమవారం ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

‘‘రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని… వివిధ మార్గాల్లో చేసిన అప్పులను ఎప్పుడైనా సమీక్షించారా?’’ అని ఎంపీ రఘురామ ప్రశ్నించారు. అయితే ఆమె దీనికి సూటిగా సమాధానం ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేశారు.  ‘‘ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఆమోదించింది. రెవెన్యూ లోటును నియంత్రిస్తూ, రుణాలపై సరైన విధానాన్ని అనుసరిస్తూ, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పాటించేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం తోడ్పడుతుంది” అంటూ డొంకతిరుగుడు సమాధానం చెప్పారు.  ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట అమలును రాష్ట్ర శాసన వ్యవస్థ పర్యవేక్షిస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం ఆమోదించిన సిఫారసులకు లోబడి రుణ పరిమితిని విధిస్తుందని చెప్పారు గాని అసలేమి జరుగుతుందో వివరించే ప్రయత్నం చేయలేదు. 

నిజానికి, అప్పులపై రాష్ట్ర బడ్జెట్‌లోని మాయ లెక్కల ఆధారంగా రిజర్వు బ్యాంకు రూపొందించిన నివేదికలోని అంకెలనే నిర్మలా సీతారామన్‌ తన సమాధానంలో పొందుపరిచారు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులను ఆమె దాచేశారు.  ఈ లెక్కలు చెప్పడంలేదంటూ నాలుగేళ్లుగా ‘కాగ్‌’ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తుంది. ఈ సమాచారం సేకరించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాన్ని కూడా పంపింది. అయినా కార్పొరేషన్‌ అప్పుల లెక్కలను రాష్ట్రం చూపించలేదు. ఇది అసలు విషయం! 

మరోవైపు, రాష్ట్ర జీఎ్‌సడీపీలో 32.95 శాతం మేర అప్పులు ఉన్నాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధురి వెల్లడించారు. 2014-15 నుంచి 2023-24 వరకు రూ.6,13,885 కోట్ల మేర నిధులను ఏపీకి బదిలీ చేశామని పేర్కొన్నారు.  ఈ మొత్తంలో పన్నుల పంపిణీ రూపేణ రూ.2,92,848 కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపేణ రూ.2,92,394 కోట్లు, రుణాలు, అడ్వాన్సుల రూపేణ రూ.28,643 కోట్లు ఉన్నాయని వివరించారు. కేంద్రం నుండి ఉదారంగా నిధులు సమకూరుతున్నా జగన్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తుండటం స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles