ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత వారం హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు తమ పార్టీ (బిజెపి) కుటుంభం పార్టీలకు వ్యతిరేకం అని పరోక్షంగా కేసీఆర్ ను దృష్టిలో ఉంచుకొని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో సహితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం వచ్చే ఎన్నికల్లో జగన్ వ్యతిరేక ఓట్లు చీలకూడదని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు.
అయితే, టీడీపీ, వైసీపీ – రెండు కుటుంభం పార్టీలను, ఆ రెండింటికి బిజెపి ఎప్పుడూ దూరంగానే ఉంటుందని అంటూ సోము వీర్రాజు, ఇతర బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు. `కుటుంభం పార్టీ టీడీపీ’తో ఎప్పుడు కలిసే ప్రసక్తి లేదంటూ పరోక్షంగా రాష్ట్రంలో తిరిగి వైసీపీ గెలుపొందేందుకు వ్యూహాత్మక సహకారం అందించేందుకు సిద్ధమవుతున్నారు. తమ పొత్తు జనసేనతో మాత్రమే అంటూ, అది కుటుంభం పార్టీ కాదని కూడా సర్టిఫికెట్ ఇస్తున్నారు.
అయితే, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ఆ పార్టీలో కీలక పాత్ర వహిస్తున్నా కీలకమైన పదవిలో లేరు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా మాత్రమే ఉన్నారు. కానీ, తాజాగా ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పవన్ నియామక పత్రాన్ని అందించారు. అంటే, పార్టీలో అధ్యక్షుడైన తన తర్వాత కీలకమైన వ్యక్తి నాగబాబు మాత్రమే అనే సంకేతం ఇచ్చారు. పరోక్షంగా జనసేన తమ `కుటుంభ పార్టీ’ అని స్పష్టం చేసిన్నట్లయింది.
పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ఎన్ఆర్ఐ విభాగం, అభిమానులను నాగబాబు సమన్వయ పరిచే బాధ్యత కూడా నాగబాబుకు పవన్ కళ్యాణ్ అప్పగించారు. ఒక విధంగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, పార్టీ కమిటీల ఏర్పాటు లతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలు అన్నింటిని నాగబాబు పర్యవేక్షిస్తారని చెప్పినట్లయింది.
ఒక విధంగా జనసేనలో విశేషమైన రాజకీయ అనుభవం, నేపథ్యం గల నేత నాదెండ్ల మనోహర్ మాత్రమే. రెండు సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా, స్పీకర్ గా పనిచేశారు. అయితే ఆయనను ఇతరులతో చర్చలకు, జనం ముందుకు వెళ్ళేటప్పుడు తోడుగా తీసుకు వెళ్లడమే గాని పార్టీ అంతర్గత వ్యవహారాలలో ప్రేక్షక పాత్రకే పవన్ కళ్యాణ్ పరిమితం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే బీజేపీ నేతలు చెబుతున్న కుటుంభం పార్టీ, వారసత్వ రాజకీయాల కేటగిరీ కిందకు జనసేన వస్తుందో, రాదో వారికే తెలియాలి. తమకు దాసోహమంటే అటువంటి అభ్యంతరాలు ఏవీ రావని చెబుతారా?