అన్నమయ్య డ్యామ్ హామీలపై పవన్ నెల రోజుల గడువు

Wednesday, January 22, 2025

2021లో వరదల కారణంగా కడప జిల్లాలోని అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన దుర్ఘటనలో 33 మంది జలసమాధి అయ్యారు. అయితే అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం  ఏడాదిలో పూర్తి స్థాయిలో అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చింది. నెల రోజుల్లో బాధితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

అయితే ఘటన జరిగి 18 నెలలైనా ఇప్పటివరకు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. ఈ హామీలపై రెండ్రోజులగా జనసేన అధినేత పవన్ కల్యాణ్  ట్విట్టర్ లో ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ప్రకటించిన సీఎం జగన్ 18 నెలలు గడిచినా ఒక్క పని కూడా చేయలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు.

అన్నమయ్య డ్యామ్ బాధితులకు నెలరోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త ఏంటో తెలుసుకునేందుకు తాము నెల రోజులు ఆగుతామ‌ని చెప్పారు. అన్నమయ్య డ్యామ్ బాధితుల విషయంలో వైసీపీ ప్రభుత్వ స్పందన మోకాలడ్డేలా, కంటి తుడుపు చర్యలా ఉండబోదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వారిచ్చిన హామీని ఎంత వరకు నిబద్ధతతో నెరవేర్చారో చూసేందుకు మరో నెల రోజులు జనసేన ఎదురుచూస్తుంద‌ని తెలిపారు.

ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక. కనీసం ఈరోజుకీ వీసమెత్తు పనులు చేయలేదని పవన్ విమర్శించారు.. ఈ 18 నెలల్లో సాధించింది ఏమిటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని రూ.660 కోట్లకు అప్పచెప్పార‌ని జనసేన అధినేత ఆరోపించారు.

కేంద్ర జల వనురుల శాఖ మంత్రి షెకావత్  రాజ్యసభలో ఇది (అన్నమయ్య డ్యామ్ ఘటన) రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుందని వాపోయారని ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు.

2021 నవంబర్ 19న కురిసిన అతి భారీ వర్షాలకు అన్నమయ్య డ్యామ్ మట్టికట్ట తెగిపోయింది. ఆకస్మాత్తుగా సంభవించిన వరద కారణంగా మందపల్లి, తొగురుపేట, పులపటూరు, గుండ్లూరు గ్రామాలను నీరు ముంచెత్తింది. ఈ ఘటనలో 33 మంది జలసమాధి అయ్యారు.

ఈ ప్రమాదం అనంతరం ఏపీ ప్రభుత్వం సీఎం అధ్యక్షత ఒక హైలెవెల్ కమిటీ వేసింది. ఈ దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ కమిటీ ఏమైందో? వారు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఇటువంటి సూచనలు చెప్పారో? ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారో? ఆ దేవుడికే ఎరుక అంటూ పవన్ ఇటీవల ట్వీట్ చేయడంతో అధికారులలో కదలిక వచ్చినట్లయింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles