మాజీ మంత్రి, కొత్తగూడెం ఎమ్యెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో బిఆర్ఎస్ ఎమ్యెల్యేలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 18న కనీసం 80 సీట్లకు తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అనుకొంటున్న సీఎం కేసీఆర్ కు సహితం ఈ పరిణామం అనూహ్యమైన ఇరకాట పరిస్థితులను కలిగిస్తున్నది.
మొత్తం 30 మంది వరకు ఎమ్యెల్యేలు తెలంగాణాలో అనర్హత పిటీషన్లను ఎదుర్కొంటున్నారు. వారిలో 28 మంది ఇప్పుడు బిఆర్ఎస్ లో ఉన్నారు. కోర్టులలో ఈ పిటీషన్లు కొనసాగుతున్నా వారంతా దాదాపుగా తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకోగలిగారు. అయితే, ఇప్పుడు ఎన్నికల ముందు ఈ పిటీషన్లు హైకోర్టు ముందుకు రావడంతో తమ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్నలు వారిని వెంటాడుతున్నాయి.
ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ లలో తప్పుడు సమాచారం ఇవ్వడం, ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు, ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలు వంటి అంశాలపై ఈ పిటీషన్లు అప్పుడే దాఖలయ్యాయి. పైగా ఈ పిటీషన్లను త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. దానిథి వీటి విచారణ హైకోర్టులో వేగం పుంజుకొంటున్నది. విచారణను అడ్డుకోవాలని కొందరు దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీంకోర్టు, హైకోర్టులు కొట్టివేస్తున్నాయి.
ఇప్పటికే మంత్రులు శ్రీనివాస్ గౌడ్ పై దాఖలైన పిటీషన్ పై విచారణ ప్రారంభమైనది. మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ పై బుధవారం విచారణకు రానుంది. ఈ పిటీషన్లలో ఆగస్ట్ 12 నుంచి 17 వరకూ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. రానున్న రోజుల్లో మరికొందరు నేతల ఎలక్షన్ పిటిషన్‌లు విచారణకు రానున్నాయని తెలుస్తోంది. మొత్తమ్మీద చూస్ ఈ నెలాఖరుకల్లా మొత్తం 28 మంది ఎమ్మెల్యేల జాతకం తేటతెల్లమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే ఒక ఎమ్మెల్యే అనర్హతకు గురవడంతో, మరో 28 మందిపై నెలాఖరుకల్లా వేటుపడే అవకాశాలు మెండుగా ఉన్నట్టు అధికార పార్టీలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా ఈ నెలాఖరులోగా ఎంతమంది ఎమ్యెల్యేలుగా మిగులుతారో అన్నది చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వేళ ఈ పిటీషన్లు ఈ నెలాఖరు లోగా తేలని పక్షంలో, వీరిపై కేసీఆర్ ఏవిధంగా స్పందిస్తారన్నది తెలియడం లేదు. వారికి తిరిగి సీట్లు ఇస్తారా? లేదా వేరేవారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
గద్వాల్ లో డీకే అరుణ (బీజేపీ)పై గెలుపొందిన కృష్ణమోహన్ రెడ్డి, ఖైరతాబాద్ లో దానం నాగేందర్, కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ తదితరులు అనర్హత పిటీషన్లు ఎదుర్కొంటున్నారు. వీరిలో పలువురు కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలుపొంది ప్రస్తుతం బిఆర్ఎస్ లో ఉన్నారు. బిజెపి నుండి సస్పెండ్ అయిన రాజా సింగ్ సహితం అనర్హత పిటీషన్ ఎదుర్కొంటున్నారు.