అధికారులను మహిళలతో తన్నిస్తామన్న బిఆర్ఎస్ ఎమ్యెల్యే

Sunday, November 17, 2024

ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో తమ ఎమ్యెల్యేలను నిత్యం ప్రజల మధ్యనే ఉండాలని బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేస్తున్నారు. దానితో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించక వారికి తప్పడం లేదు. అయితే చాలామంది ఎమ్యెల్యేలకు గ్రామాలలో,  పట్టణాలలో ప్రజల నుండి నిరసనలు వ్యక్తం అవుతూ ఉండడంతో వారు ఖంగు తింటున్నారు. 
తమ ప్రభుత్వం పనితీరు చూసే ప్రజలు వరుసగా మూడోసారి తనను గెలిపిస్తారని కేసీఆర్ ఒక వంక ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవంక ఐదేళ్లుగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అంటూ ప్రజలు ఎమ్యెల్యేలను నిలదీస్తున్నారు. చివరకు సొంత పార్టీ మద్దతు దారులు సహితం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దానితో చాలామంది ఎమ్యెల్యేలు సహనం కోల్పోయి ప్రజలపై విరుచుకు పడుతున్నారు. 

తాజాగా, డోర్నకల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వివాదాల్లో చిక్కుకున్నారు. జనం నిలదీస్తుంటే సహనం కోల్పోయి మిషన్ భగీరథ నీళ్లు తమ ఇంటికి రాలేదని ఎవరైనా తనకు ఫిర్యాదు చేస్తే  దానికి బాధ్యులైన అధికారిని మహిళలతో తన్నిస్తానని హెచ్చరించారు. డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యా నాయ‌క్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. 

వివాదాలకు దూరంగా ఉండే రెడ్యా నాయక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.  ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వం ఇస్తున్న హామీలు నెరవేరక ఎక్కడికక్కడ జనం నిలదీస్తుండటంతో అధికార పార్టీ ఎమ్యెల్యేలో అసహనానికి గురవడాన్ని వెల్లడి చేస్తుంది. మ‌హబూబాబాద్ జిల్లా డోర్న‌క‌ల్ మండ‌లం గొల్ల‌చ‌ర్ల‌లో అన్ని శాఖ‌ల అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, బీఆర్ఎస్ నాయ‌కుల‌తో క‌లిసి స‌మావేశం నిర్వహించారు. ఇందులో భాగంగానే.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు రావ‌డం లేద‌ని ఎవ‌రైనా ఫిర్యాదు చేస్తే, అందుకు కార‌ణ‌మైన అధికారిని ఆడ‌వాళ్ల‌తో త‌న్నిస్తా అంటూ ఎమ్మెల్యే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 ఫ‌కీరా తండాలో నీళ్లు రావ‌డం లేద‌ని తెలిసి మ‌ర‌మ్మ‌తుల‌కు రూ.5 ల‌క్ష‌లు ఇచ్చి 4 నెల‌ల‌వుతోంద‌ని, ఇప్ప‌టికీ ప‌ని పూర్తిచేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు. ఇలాగైతే ప్ర‌జ‌లు త‌న‌కు ఓట్లు ఎలా వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.  ఈ నెల 28 నాటికి లోటుపాట్లను సరిదిద్దుకోవాలని తెలిపారు. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, ఆ తర్వాత పోటీ చేయబోనని, ఇంకొక్కసారి తనను గెలిపించాలని ప్రజలను కోరుతూ గత వారం రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే వెళ్లిన చాలాచోట్ల ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న‌లు ఎదురువుతున్నాయి. 

గెలిచినా ఇన్ని ఏళ్లకు మళ్లీ మీము గుర్తు వచ్చామా? అని ఎక్కడిక్కడే నిలదీస్తున్నారు. అసలు మా ఊరికి ఏంచేశారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రజల నుండి నిరసనలు ఎదురువుతుండడంతో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పోలీస్ బందోబ‌స్తు పెట్టుకుని మ‌రీ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.  ఇటువంటి పరిస్థితి చాలా నియోజకవర్గాలలో నెలకొంది. దానితో కనీసం సగం మంది ఎమ్యెల్యేలను కాదని కొత్త అభ్యర్థులను రంగంలోకి తెస్తే గాని వచ్చే ఎన్నికలలో అధికార పార్టీ ప్రచారం సవ్యంగా జరపడం కూడా కష్టంగా మారే ప్రమాదం ఉందని అధికార పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles