తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును జగన్ చాలా సందర్భాల్లో ఎద్దేవా చేస్తుంటారు. ఆయన పార్టీ సహచరులైతే చాలా చాలా లేకి, చవకబారు విమర్శలు చేస్తుంటారు. అచ్చెన్నాయుడు భారీ ఆకారంతో ఉంటారు. ఆయన ఆకారాన్ని హేళన చేస్తూ చవకబారు విమర్శలు చేయడం వైసీపీవారికి అలవాటు. అయితే తాజా పరిణామాల్ని గమనిస్తోంటే.. టెక్కలిలో అచ్చెన్నాయుడు తో ఎన్నికల్లో తలపడాలంటే మాత్రం జగన్ దళంలో వణుకు పుట్టినట్టుగా కనిపిస్తోంది.
టెక్కలి నియోజకవర్గం తెలుగుదేశానికి పట్టున్న నియోజకవర్గం అని చెప్పాలి. ఇక్కడినుంచి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అయితే టీడీపీ రాష్ట్ర సారథి అయిన అచ్చెన్నను ఓడించాలని వైసీపీ చాలా పట్టుదలగా ఉంది. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసిన పేరాడ తిలక్ ఓడిపోయిన తర్వాత వారు వ్యూహం మార్చుకున్నారు. అక్కడ అచ్చెన్నమీద చాలా దూకుడుగా విరుచుకుపడుతూ ఉండే దువ్వాడ శ్రీనివాస్ ను ఆయన మీద మోహరించడానికి నిర్ణయించారు. అధికార హోదా ఉండడం కోసం దువ్వాడకు ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టారు. అసలే దూకుడు ఆపై పదవి కూడా ఉండడంతో దువ్వాడ అచ్చెన్నమీద రెచ్చిపోతూ ఉన్నారు.
ఇటీవల మూలపేట పోర్టు శంకుస్థాపనకు వచ్చిన జగన్ నౌపడలో జరిగిన సభలో దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. దువ్వాడను టెక్కలి ప్రజలు ఘనంగా గెలిపించాలని కూడా కోరారు. అది జరిగి ఇప్పటికి ఒకటిన్నర నెల కూడా గడవలేదు. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో ప్రెస్ మీట్ పెట్టి.. తాను పోటీచేయడం లేదని, తన భార్య దువ్వాడ వాణి బరిలో ఉంటారని, ఇందుకు సీఎం జగన్ కూడా అంగీకరించారని ప్రకటించారు. కేవలం ఒకటిన్నర నెలల వ్యవధిలో ఇంత మార్పు ఎందుకు జరిగిందో మాత్రం బయటకు రాలేదు.
దువ్వాడ వాణి తానే బరిలో ఉంటానని పట్టుబట్టారని, సీఎంను ఆమె స్వయంగా అడిగారని ఆ తర్వాత ఈ కొత్తనిర్ణయం వచ్చిందని ఒక వాదన వినిపిస్తోంది. అయితే టెక్కలిలో అచ్చెన్నతో తలపడడానికి భయపడడం వల్లనే వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అచ్చెన్నతో తలపడి ఓడిపోతే పరువు పోతుంది. అదే భార్యను రంగంలోకి దించితే.. ఓడిపోతే గనుక పార్టీకోసం తమ కుటుంబం త్యాగం చేశాం అని చెప్పి మరోసారి ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోవచ్చు. అదృష్టం కలిసొచ్చి గెలిస్తే ఇంకా మంచిది. టీడీపీ రాష్ట్ర సారథిని ఒక మహిళ చేతిలో ఓడించాం అని గప్పాలు కొట్టుకోవచ్చు. ఆ వ్యూహంతోనే ఇలా చేశారని అంతా అనుకుంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉత్తరాంధ్రలో పరాభవం ఎదురైన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగడానికి చాలా మంది వెనుకాడుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.
అచ్చెన్న పట్ల జగన్ లో భయానికిది చిహ్నమా?
Sunday, December 22, 2024