అక్రమాస్తుల కేసులో జగన్ కు సుప్రీం షాక్ ట్రీట్మెంట్!

Sunday, December 22, 2024

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్దపడేందుకు కేంద్ర పెద్దల నుండి కీలకమైన మద్దతు కోసమై, బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిబిఐ దూకుడు విషయమై కేంద్ర పెద్దల నుండి పూర్తి భరోసా పొందేందుకు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుస భేటీలు జరుపుతున్న సమయంలో సుప్రీంకోర్టు ఒక విధంగా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయింది.

తనపై నమోదైన పలు అక్రమాస్తుల కేసుల దర్యాప్తు, కోర్టు విచారణ ముందుకు జరగకుండా, తాను కోర్టుకు హాజరు కాకుండా గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ మద్దతుతో  చేసుకో గలుగుతున్న వైసిపి అధినేతకు ఒక విధంగా అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయ వేసినట్లయింది.  వేగంగా విచారణ జరిగే అవకాశం ఉండటమే కాకుండా, బెయిల్ రావడం కూసే కష్టమయ్యే ఈడీ కేసుల విచారణ ప్రారంభం కాకుండా జాప్యం జరిగేటట్లు గత పలు సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినట్లయింది. 

అక్రమ ఆస్తుల కేసులో జగన్‌ సంస్థలకు సుప్రీం ధర్మాసనం తాజాగా నోటీసులు జారీ చేసింది. జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ , వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిలకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.  దానితో ఎన్నికల సంవత్సరంలో ఈ కేసులు వేగం పుంజుకొని అవకాశం కనిపిస్తుంది.

అక్రమాస్తుల కేసులో తొలుత సీబీఐ కేసులు విచారించాలని, అప్పటి వరకు ఈడీ నమోదు చేసిన కేసుల విచారణ ఆపాలని ట్రయల్ కోర్టును తెలంగాణ హైకోర్టు గతంలో ఆదేశించింది. సీబీఐ ఛార్జిషీట్లపై తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని పేర్కొంది.  సీబీఐ కేసులలో ఒకొక్క నిందితుడు డిశ్చార్జ్ పిటీషన్లు దాఖలు చేస్తూ, వాటి విచారణలో జాప్యం జరిగేటట్లు చేయడం ద్వారా ఆ కేసుల ట్రయిల్ ప్రారంభం కాకుండా చూస్తున్నారు.

ఈడీ కేసులు ప్రారంభమయతే వేగంగా జరిగే అవకాశం ఉంది. వాటిల్లో సాక్ష్యాధారాలు సహితం స్పష్టంగా లభించే అవకాశం ఉంది. అందుచేత వాటి విచారణ ఇప్పుడే రాకుండా సుదీర్ఘకాలం జాప్యం జరిగే విధంగా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల విచారణ సమాంతరంగా జరిపితే, సీబీఐ కేసులపై తీర్పు తర్వాతే ఈడీ కేసులపై తీర్పు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం ఆదేశించింది.

సీబీఐ నమోదు చేసిన కేసులు, ఈడీ నమోదు చేసిన కేసులు సమాంతరంగా విచారణ కొనసాగించవచ్చునని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ ధర్మాసనం కొట్టివేసింది. హైదరాబాబ్‌ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తుది ఆదేశాలపై 2021లో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

దీంతో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా, జస్టిస్‌ సంజయ్‌ కరోలలతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 5వ తేదీలోపు సమాధానం చెప్పాలని ప్రతివాదులుగా ఉన్న విజయసాయిరెడ్డి, భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్‌‌లకు నోటీసులు జారీ చేసింది. 

ఈ కేసు పూర్తి స్థాయి విచారణ సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం చేపట్టాలా, లేక త్రిసభ్య ధర్మాసనం చేపట్టాలన్నది ఆరోజు నిర్ణయిస్తామని ధర్మాసనం పేర్కొంటూ సెప్టెంబర్ 5వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. వైఎస్‌ భారతి రెడ్డిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ కేసులతో జత పరిచి ఉన్న పిటిషన్‌ను విడిగా విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles