గుజరాత్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూశారా? ఇప్పటికే ఏడుసార్లుగా అప్రతిహతంగా నెగ్గుతూ అధికారంలోనే ఉన్న భారతీయజనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అందరూ జోస్యం చెబుతున్నారు. ఇంత సుదీర్ఘకాలంగా పరిపాలన సాగిస్తున్న పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఏ కొంతైనా ఏర్పడకుండా ఉంటుందా? ఇలాంటి నమ్మకంతోనే ఈసారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గుజరాత్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంది. కానీ.. వారి ఆశ నెరవేరేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం ఉన్నదని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టబోతున్నారని విర్రవీగిన మల్లికార్జున ఖర్గే అంచనాలు కూడా నిజమయ్యేలా లేవు. ఈ రాష్ట్రంలో చాలా స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది రెండు పార్టీల మధ్య చీలిపోయినట్టుగా కనిపిస్తోంది.
అలాంటి చీలిక ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడకూడదు అనేదే.. పవన్ కల్యాణ్ తొలినుంచి చెబుతున్న మాట. వ్యతిరేక ఓటు చీలిపోకూడదని, అందుకు అన్ని పార్టీలు ఐక్యంగా బరిలోకి దిగాలని ఆయన తొలినుంచి అంటున్నారు. కాకపోతే ఇక్కడ కనిపిస్తున్న ప్రధానమైన వ్యత్యాసం ఒక్కటే. బిజెపి- వైసీపీ మధ్య అభివృద్ధి రాజకీయాలకు, బిస్కట్ రాజకీయాలకు మధ్య ఉండేంత వ్యత్యాసం ఉంది. బిస్కట్ రాజకీయాలు లేకుండా.. సమర్థమైన పాలన ద్వారా అధికారం నిలుపుకుంటూ వస్తున్న బిజెపికి.. ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడి ఉంటుంది గానీ.. దానిని రెండు పార్టీలు చీల్చుకున్నాయి. అలాంటిది జరగకూడదని పవన్ అంటున్నారు.
ఇక్కడ ఏపీలో మొత్తం సంక్షేమ పథకాల ముసుగులో.. అధికారికంగా ప్రభుత్వ సొమ్మును ప్రజలకు అనుచితమైన రీతిలో పంచేసి.. మళ్లీ వారి వద్దకు వెళ్లి.. ఇలాంటి డబ్బు అందుతూ ఉండాలంటే.. మళ్లీ ఫ్యాను గుర్తుకే ఓటు వేయండి అనేది ఒక రివాజుగా మారిపోయింది. తాయిలాలు ఒక్కో కుటుంబానికి ఎంతెంత ఇచ్చారో.. వారికే లెక్కచెప్పి తమకు రుణపడి ఉండేలా మార్చుకోవాలనేది ప్లాన్.
కానీ ప్రజల్లో ఆలోచనను రగిలించడం పవన్ కల్యాణ్ ఉద్దేశం. అందుకే ఆయన తొలినుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఎజెండాతో ఉన్నారు. ఆలోచన పరులైన ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కూడా నిర్మాణం అవుతోంది. ఒక్క చాన్స్ అని నమ్మి చేసిన తప్పును ప్రజలు తెలుసుకుంటున్నారు. రాజకీయంగా తటస్థులు, ఆలోచనా పరుల్లో అలాంటి వ్యతిరేకత ఏర్పడితే.. వారికి తొలి ప్రత్యామ్నాయంగా ఒక కూటమే కనిపించాలి తప్ప.. రెండు పార్టీలు కనిపించకూడదు అనేది పవన్ కల్యాణ్ ప్రయత్నం. అలాంటి ప్రయత్నం సఫలం అయితే.. జగన్ తన విజయం మ్యాజిక్ ను మళ్లీ రిపీట్ చేయడం జరగదు.