అంతులేని రాజయ్య, కడియంల జగడం

Wednesday, January 22, 2025

వారిద్దరూ అధికార పక్షంలో ప్రజాప్రతినిధులు. గతంలో ఉప ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా పనిచేసిన వారే. అయితే మొదటి నుండి పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. అయినా, బిఆర్ఎస్ పెద్దలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం తాను మంత్రివర్గంలో లేకపోవడానికి ఎదుటివాడి అనే ఇద్దరూ భావిస్తూ ఉండడమే ఈ అంతులేని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొంటున్నారు.

వీరిద్దరూ కలిసి అధికార పక్షం పరువును బజారున పడేస్తున్నారు. వారిద్దరూ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.  కడియం కూడా స్టేషన్ ఘన్‌పూర్ లో మాజీ ఎమ్యెల్యే. ఇద్దరూ అదే సీట్ కోరుకొంటుండటంతో ఒకరిపై మరొకరు వీలు చిక్కినప్పుడల్లా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అధిష్ఠానం హెచ్చరించినా వారి తీరు మారడంలేదు. మంత్రిగా ఉన్నప్పుడు కడియం అవినీతి చేశారని ఎమ్మెల్యే రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు. 

ఈ ఆరోపణలపై కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని రాజయ్యకు శ్రీహరి సవాల్ చేశారు. రాజయ్య పార్టీ లైన్‌ దాటి మాట్లాడుతున్నారని, అయినప్పటికీ మీరు తొందరపడొద్దని పార్టీ పెద్దలు తనకు సూచించినట్లు పేర్కొన్నారు. అందువల్లే తాను రాజయ్యపై ఎలాంటి విమర్శలు చేయకుండా ఊరుకున్నట్లు చెప్పారు.

రాజయ్య వైద్యుడే అయినా సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని శ్రీ హరి మండిపడుతూ తన తల్లి కులం, తన కులం గురించి మాట్లాడడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు తండ్రి కులమే వస్తుందని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. తల్లి మాత్రమే సత్యం, తండ్రి అపోహా అని రాజయ్య దారుణంగా మాట్లాడారని, ఈ వ్యాఖ్యలకు ఆయన ముక్కు నేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

నాలుగు రోజుల ముందు, కడియం శ్రీహరి అవినీతి తిమింగలమని, భారీగా ఆస్తులు కూడబెట్టారని అంటూ రాజయ్య తీవ్రమైన ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో కడియం శ్రీహరి అనినీతి చేశారని చెబుతూ సమయం  వచ్చినప్పుడు కడియం అక్రమాస్తుల చిట్టా బయటపెడతామని స్పష్టం చేశారు. 

నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించడానికి ఎక్కడికైనా వస్తానని కడియంకు ఎమ్మెల్యే రాజయ్య సవాల్ విసిరారు. ఎవరెన్ని కుట్రలు చేసినా స్టేషన్ ఘన్ పూర్ సీటు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలలో కూడా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే సీటు కోసం కడియం శ్రీహరి, రాజయ్య పోటీ పడుతున్నారు. అందుకనే, ఇన్నాళ్లు పరోక్షంగా విమర్శలు చేసుకున్న నేతలు  ఇప్పుడు ప్రత్యక్షంగా పేర్లు ప్రస్తావిస్తూ దుర్భాషలకు దిగుతున్నారు.

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో సొంత పార్టీ ఎమ్మెల్యే ఉనికిని పట్టించుకోకుండా కడియం శ్రీహరి తరచూ పర్యటిస్తూ వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. దీంతో పాటు నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు బాగా పెరిగిపోయాయని రాజయ్యపై విమర్శలు చేస్తున్నారు. పైగా,  స్టేషన్ ఘన్ పూర్ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా కడియం పాల్గొంటూ ఉండడంతో రాజయ్య కడియంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles