అంతర్గత పోరుతో ఎంపీ అరవింద్ ఉక్కిరిబిక్కిరి

Wednesday, September 18, 2024

రాజకీయాలలో తొలి ప్రయత్నంలోనే గత లోక్ సభ ఎన్నికలలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి సంచలనం సృష్టించిన బిజెపి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆ తర్వాత తరచూ ప్రజా నిరసనను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల విషయమై తరచూ ఆయనను జనం నిలబెడుతున్నారు.

ముఖ్యంగా ఎన్నిక కాగానే అక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చూపిస్తానని బాండ్ పేపర్ పై రైతులకు రాసిచ్చిన ఆయన ఆ విషయంలో విఫలం కావడంతో తగు సమాధానం చెప్పలేక తికమక పడుతున్నారు. మరోవంక మొదట చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కొంతకాలంగా పడకపోవడంతో రాష్త్ర బీజేపీలో `అసమ్మతి నేత’గా మిగిలి పోయారు.

ఇంతలో జి కిషన్ రెడ్డి రాష్త్ర అధ్యక్షుడు కావడంతో రాష్ట్ర పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పేందుకు సిద్ధమవుతున్నారు.  దానితో హుషారుగా ఉన్న అరవింద్ కు తన నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుండే అసమ్మతి విజృంభించడంతో ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ముఖంగా మండల పార్టీ అధ్యక్షుల మార్పుపై పెద్ద ఎత్తున నిరసనలు ఎదురవుతున్నాయి.

అర్వింద్ ఏకపక్షంగా 13 మండలాల అధ్యక్షులను మార్చారని ఆరోపిస్తూ ఆర్మూర్, బాల్కొండ, బోధన్ మండలాలకు చెందిన కార్యకర్తలు రెండు రోజుల క్రితం నేరుగా హైదరాబాద్ లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంపై వచ్చి నానారభస చేశారు. ఎంపి అర్వింద్ అరాచకాలు పెరిగాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  సొంత పార్టీ కార్యకర్తల కు ఎంపి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చిన మండలాల అధ్యక్షులను తిరిగి నియమించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.

దాంతో అరవింద్ అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం పొందాయి. బిజెపి రాష్త్ర నాయకత్వం దిగ్భ్రాంతి చెందింది. అర్వింద్ పాత వారందరినీ పక్కన పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్యాం సుందర్ మాట్లాడుతూ.. ఎంపి అర్వింద్ నిజామాబాద్ జిల్లాలో 13 మండలాల అధ్యక్షులను మార్చివేశారని మండిపడ్డారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా అధ్యక్షులను మార్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలుగజేసుకొని సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. 

దీంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్, నిజామాబాద్ జిల్లా నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళాలని ఉమా శంకర్ కోరినా వారు కార్యాలయంలోనే బైఠాయించి నిరసన తెలిపారు. కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో ఉండగానే ఇదంతా జరిగింది.

రాష్ట్ర అధ్యక్షుడితో చెప్పకుండా  మీడియాతో ఎందుకు మాట్లాడుతున్నారని వారిపై వారిపై మండిపడిన రాష్త్ర కార్యదర్శి డా. ప్రకాష్ రెడ్డితో కూడా వాగ్వాదానికి దిగారు. అక్కడున్న పార్టీ నేతలు చెప్పినా వినిపించుకోని కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తమకు న్యాయం చేయాలని వారు నినాదాలు చేశారు. చివరకు కిషన్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేస్తామని పార్టీ నేతలు హామీ ఇవ్వడంతో కార్యకర్తలు ఆందోళన విరమించారు.

అయితే, మండల అధ్యక్షుల మార్పుతో తనకు సంబంధం లేదని, అదంతా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య చేసిన నిర్వాకం అంటూ తప్పించుకొనే ప్రయత్నం అరవింద్ చేస్తున్నారు.  జిల్లా పార్టీలో సంస్థాగత నిర్ణయాలు, మార్పులు, చేర్పుల బాధ్యత అధ్యక్షుడిదేనని గొడవ జరిగిన రోజే స్పష్టం చేశారు.  తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని స్పష్టం చేయడంతో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన అసంతృప్త నేతలు మండిపడుతున్నారు.

లక్ష్మీనారాయణ నామమాత్రంగా పదవిలో కొనసాగుతున్నారని, పెత్తనం ధర్మపురి అర్వింద్‌దేనని చెప్తున్నారు. అర్వింద్‌ చెప్పినట్టు నడుచుకోకుంటే లక్ష్మీనర్సయ్య పదవి పోతుందని పేర్కొంటున్నారు.  మండలాధ్యక్షుల మార్పుల జాబితాను అర్వింద్‌ స్వయంగా సిద్ధం చేశారని, లక్ష్మీనారాయణ కేవలం దానిపై సంతకం పెట్టారని చెప్తున్నారు. మరోవంక, ఈ అలజడి వెనుక మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాత్ర ఉండవచ్చనే అనుమానాలు సహితం వ్యక్తం అవుతున్నాయి. దానితో కిషన్ రెడ్డికి ఇదొక్క జటిల సమస్యగా మారే అవకాశం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles