విశాఖలో జగన్ కు వరుసగా దెబ్బలు… తాజాగా కీలక నేత జంప్!

Friday, July 26, 2024

విశాఖపట్టణంను పరిపాలన రాజధానిగా ప్రకటించి, మొత్తం రాజధాని వ్యవహారాలను అమరావతి నుండి అక్కడకు తరలించేందుకు సన్నాహాలు ప్రారంభించినప్పటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అక్కడ వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీలో నం 2గా పరిగణించే విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పజెప్పితే అక్కడ అంతులేని భూ దందాలతో పార్టీని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు కావించారు.

అలాకాదని, బాబాయి వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పజెప్పితే ఆయన సారధ్యంలో పార్టీ పరిస్థితి మరింతగా దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి.  పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థిని టిడిపి అభ్యర్థి ఓడించడంతో పెద్ద షాక్ తగిలినట్లయింది. మరోవంక, రాజధాని తరలింపు ప్రక్రియకు సర్వం సిద్ధం చేసినా, ఉన్నత న్యాయస్థానాల అడ్డంకులతో ముందుకెళ్లడం లేదు.  డిసెంబర్ లో కానీ విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు చెప్పడం చూస్తుంటే వచ్చే ఎన్నికల లోపు సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు.

మొదట్లో వైసీపీ వైపు చూసిన గంటా శ్రీనివాసరావు వంటి వారు తిరిగి టిడిపిలో క్రియాశీలం అవుతున్నారు. తాజాగా, జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్‍బాబు పార్టీ అధ్యక్ష పదవికి, సభ్యత్వానికి రాజీనామా ప్రకటించడంతో వైసీపీ వర్గాలు ఖంగుతిన్నాయి. పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాననని, తనను క్షమించాలని కోరుతూ బాధగా ఉన్నప్పటికీ తప్పని పరిస్థితులలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

పార్టీలో అందరికి పదవులు రాకపోయినా కనీసం గౌరవం అయినా దక్కేందుకు ప్రయత్నించానని, అది కూడా చేయలేకపోయానని పంచకర్ల చెప్పారు.పార్టీలో కొందరికి పదవులు, కొందరికి కనీసం గౌరవం అయినా దక్కాలని ప్రయత్నించానని పేర్కొంటూ  తన వల్ల ఎవరికి న్యాయం జరగలేదని భావిస్తే క్షమించాలని కోరారు.

జిల్లాలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోవడంతో తన మాట వినే అవకాశం లేనందునే పార్టీని వీడుతున్నట్లు చెప్పడం ద్వారా అధిష్టానం వైఖరి కారణంగానే పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు.

కొంతకాలంగా పెందుర్తి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీలో వర్గపోరు నడుస్తోంది. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, పంచకర్ల మధ్య సీట్ వార్ నడుస్తోంది. ఇటీవల పెందుర్తిలో జరిగిన పరిమాణాలతో రమేష్‌బాబు అసంతృప్తితో ఉన్నారు. ఏ నియోజక వర్గానికి వెళ్లినా అక్కడి ఎమ్మెల్యేకు అనుకూలంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడతారని చెబుతూ ఆయనతో తనకు ఎలాంటి విభేదాలు లేవని అంటూనే తాను పార్టీకి దూరం అయ్యేందుకు సుబ్బారెడ్డి కారణం అంటూ స్పష్టమైన సంకేతం ఇచ్చారు.

ఈ నెల 8న పెందుర్తిలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే అదీప్ రాజ్‌ను పెందుర్తిలో మళ్లీ అఖండ మెజార్టీతో గెలిపించాలని పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. దీంతో తనకు సీట్ ఇచ్చే ఉద్దేశ్యం పార్టీకి లేదని గ్రహించి పంచకర్ల అసంతృప్తితో ఉంటున్నారు.  రమేష్‌బాబు కొంతకాలంగా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ టార్గెట్‌గా వ్యాఖ్యలు చేస్తూ  తాను కూడా పెందుర్తి టికెట్ రేసులో ఉన్నానని సంకేతాలు పంపారు.

పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయ ప్రవేశం చేశారు.ప్రజారాజ్యం నుంచి పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది. ఇక రాష్ట్ర విభజన అనంతరం రమేష్ బాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్‌తో పాటు టీడీపీలో చేరారు. 

ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ తరుఫున ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆగస్ట్ 2020లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఇక ప్రస్తుతం వైసీపీకి కూడా రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో రమేష్‌బాబు ఎలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓడారు. 

ఎన్నికల్లో రూరల్‌లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనకు విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్ష పదవిని అప్పగించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles