వారి ఓట్లు వీరికి.. వీరి ఓట్లు వారికి పడతాయా?

Monday, February 26, 2024

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీలు రెండూ కూడా.. తమకున్న బలానికి మించి పోటీచేస్తున్నాయి. ఇద్దరూ కూడా లేని బలాన్ని ఊహించుకుని అభ్యర్థులను మోహరించారు. అయితే సార్వత్రిక ఎన్నికలు ఇంకో ఏడాది దూరంలో మాత్రమే ఉన్న తరుణంలో.. ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా లోపాయికారీగా తమకు ఓటు వేస్తారనే ఆశతో ఈ రకంగా రెండు పార్టీలూ అభ్యర్థులను మోహరించినట్లుగా కనిపిస్తోంది.
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ కావాలంటే 23 ఓట్లయినా కావాలి. అయితే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కు ఉన్న 151 సీట్ల బలానికి ఆరుసీట్లు మాత్రమే దక్కుతాయి. కానీ వారి తరఫున మొత్తం ఏడు స్థానాలకు నామినేషన్లు వేసేశారు. తెలుగుదేశం నుంచి తాము ఫిరాయింపజేసిన నలుగురు ఎమ్మెల్యేలు ఎటూ తమకే ఓటు వేస్తారనేది వారి స్కెచ్. గెలిచే అవకాశం లేదు గనుక.. తెలుగుదేశం పార్టీ సైలెంట్ గా ఉండిపోతుందని, ఏడు ఎమ్మెల్సీలను ఏకగ్రీవంగా దక్కించుకోవచ్చునని వారు ప్లాన్ చేశారు. అయితే వైసీపీ అంచనాలకు అందకుండా, చంద్రబాబునాయుడు తమ పార్టీ తరఫున బీసీ మహిళ పంచుమర్తి అనురాధతో నామినేషన్ వేయించారు. అయితే ఏకపక్షంగా ఈ సీటును గెలచుకునే అవకాశం తెలుగుదేశానికి కూడా తక్కువ. కానీ.. తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీచేయాలని చంద్రబాబునాయుడు తలపోస్తున్నారు. విప్ జారీచేసినంత మాత్రాన ఏ మేరకు వర్కవుట్ అవుతుందో తెలియదు. అదే సమయంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమకు ఓటు వేస్తారనేది చంద్రబాబునాయుడు ఆశగా కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో పార్టీ మీద తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డితో పాటు.. చంద్రబాబుతో మరికొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని సమాచారం. వారు కూడా ఓటు వేసే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు.
సాధారణంగా ఇలా ఓటు వేయడం వల్ల.. రహస్య ఓటింగ్ ప్రకారం జరిగినా సరే.. ఎవరు తేడాగా ఓటు వేశారో పసిగట్టడం సులువు. అయినా సరే.. పార్టీ తీసుకోగల చర్యలకు సిద్ధపడి వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరైనా సహకరిస్తారనే ఆశ చంద్రబాబులో ఉన్నట్టుగా ఉంది. అదే సమయంలో.. తమ సొంత పార్టీ వారు విప్ కు జడిసి కట్టుతప్పకుండా ఓట్లు వేసినా కూడా ఎమ్మెల్సీ గెలుస్తామనే నమ్మకంతో ఉన్నారు. చూడబోతే.. ఈ రెండు పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీలనుంచి కూడా రహస్య మద్దతు ను నమ్ముకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలపడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles